Site icon NTV Telugu

సైన్స్‌ సిటీలను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహించాలి: కిషన్‌రెడ్డి

సైన్స్ సిటీలను ఏర్పాటు చేసి, తద్వారా యువతలో సైన్స్ సంస్కృతిని ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ పథకం SPoCS కింద హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనను పంపాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక శాస్త్రీయ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయని స్టేట్ ఆఫ్ ఆర్ట్ సైన్స్ మ్యూజియం ఏర్పాటుతో సైన్స్ పైయువతలో ఆసక్తిని పెంపొందుతుందని మంత్రి తెలిపారు.

సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ కేంద్రం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ , సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీ ఎఫ్ ఎస్ ఎల్ ), DNA ఫింగర్‌ప్రింటింగ్ మరియు డయాగ్నోస్టిక్స్ సెంటర్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ లాబొరేటరీ వంటి శాస్త్రీయ సంస్థలు హైదరాబాద్ లో ఉండటం గర్వ కారణమన్నారు. సైన్స్ సిటీ ఏర్పాటుతో వైజ్ఞానిక ఆవిష్కరణలకు మరో హబ్‌గా భవిష్యత్తులో హైదరాబాదును గుర్తించడానికి వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు.

సైన్స్‌సిటీల ఏర్పాటుతో యువతలో పరిశోధనాత్మక స్ఫూర్తిని, సృజనాత్మకతతో కూడిన ప్రతిభను పెంపొందించడానికి సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ఆస్కారం ఉంటుందని కేంద్రం భావిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, కుటుంబాలు, పర్యాటకులు మరియు సాధారణ ప్రజలకు ఆకర్షణీయంగా మరియు ఉపయోగకరంగా, ప్రదర్శనలో అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలు,సాంకేతికతను ఉపయోగిస్తూ రూపొందించాలని కోరారు.
సైన్స్ సంస్కృతిని ప్రోత్సహించే పథకం (SPoCS) కింద ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని తెలంగాణ సీఎంకు లేఖ రాసినట్టు ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

https://ntvtelugu.com/clashes-broke-out-between-friends-at-a-birthday-party/


Exit mobile version