Kishan Reddy Condemns Attack On Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. జనగామ జిల్లాలో బండి సంజయ్‌పై జరిగిన దాడిపై సీరియస్ అయిన ఆయన.. ఆ దాడిని టీఆర్ఎస్ మంత్రి సమర్థించుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ పీఠాలు కదులుతున్నాయని, వాళ్ల కాళ్ల కిందున్న మట్టి కదులుతోందని, అందుకే ఈ విధమైన దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ తరహా దాడులు చేయడం ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు.
టీఆర్ఎస్ ఇలాంటి దాడుల్ని ఎన్ని చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా.. మీ కుటుంబ పాలనని (సీఎం కేసీఆర్‌ని ఉద్దేశిస్తూ) ప్రజలు అంతం చేస్తారని కిషణ్ రెడ్డి అన్నారు. మీ పార్టీని గానీ, మీ నాయకుల్ని గానీ, మీ ప్రభుత్వాన్ని గానీ, మీ కుటుంబ పాలనని గానీ ఎవరూ రక్షించలేరని పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్నికలు జరుగుతాయని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ఓడించాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పోలీసులు సైతం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. ఒక పెద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేస్తుంటే, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యతలు పోలీసులదేనని అన్నారు.
పార్లమెంటు సభ్యుడిగా, రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రజల సమస్యలపై పాదయాత్ర చేస్తున్నప్పుడు.. వారిని రక్షించే బాధ్యత పూర్తిగా రాష్ట్ర పోలీసులదేనని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర పోలీసులు టీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేది మరో ఐదారు నెలలు మాత్రమేనని.. రాబోయే ఆరు నెలల్లో తెలంగాణలో అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
