Site icon NTV Telugu

Khanapur : ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా

Khanapur

Khanapur

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల నడుమ రేపటికి వాయిదా పడింది. మున్సిపల్ హాల్‌ లోపల కౌన్సిలర్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు, బయట రాజకీయ పార్టీల శ్రేణుల వాగ్వాదాల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ ఎంపిక కోసం సభ్యులు చేతులు ఎత్తే క్రమంలో ఒక పార్టీ అభ్యర్థికి మద్దతుగా సభ్యులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు , ఇతర సభ్యులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో హాల్‌ లోపల గందరగోళం నెలకొంది.

 Rashmika: హిస్టరీ క్రియేట్ చేసిన రష్మిక మందన్న.. వరుసగా రెండోసారి జపాన్ నుంచి పిలుపు!

మరోవైపు, ఎన్నికల నిర్వహణలో అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 12 వార్డులున్న ఖానాపూర్ మున్సిపాలిటీలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీఆర్ఎస్ , బీజేపీలకు చెరో నాలుగు స్థానాలు ఉండగా, కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఓటుతో పాటు, ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు ఉండటంతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరుకుంది. ఈ క్లిష్టమైన సమీకరణాల మధ్య చెలరేగిన గొడవల కారణంగా ప్రస్తుతం ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది.

Iran-Israel: ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు

Exit mobile version