Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!

  • దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
  • 2024 ఏప్రిల్‌ 23 నుంచే ఖాళీగా ఖైరతాబాద్‌ సీటు
  • అధికారికంగా గెజిట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • ఉప ఎన్నిక షెడ్యూల్‌పై ఎన్నికల సంఘం నిర్ణయం
Danam Khairatabad Bypoll

Danam Khairatabad Bypoll

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పటికే సుప్రీంకోర్టు సమర్థించింది. అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు స్పష్టమైంది. దానం నాగేందర్‌ 2024 ఏప్రిల్‌ 23న సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన తేదీ నుంచే ఆయన అనర్హత అమల్లోకి వస్తుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అదే తేదీ నుంచి ఖైరతాబాద్‌ సీటు ఖాళీగా ఉన్నట్లు కోర్టు పేర్కొంది.

 

సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించడంతో.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు అధికారికంగా గెజిట్‌ విడుదల చేసింది. 2024 ఏప్రిల్‌ 23 నుంచి ఈ స్థానం ఖాళీగా ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఖాళీ స్థానంపై ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. దీంతో హైదరాబాద్‌లో మరోసారి అసెంబ్లీ ఉప ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది.