CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 30న ఎన్నికలు జరగోతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అన్ని పార్టీలు కూడా హమీల వర్షం కురిపిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా హమీలను ప్రకటిస్తోంది. తాజాగా మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం కేసీఆర్ కీలక హామీలను ఇచ్చారు.
తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం యువత కోసం ప్రత్యేక ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ(ఐటీ) పార్కును ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్ రావు గురువారం తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో కేసీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వానికి ముస్లింలు, హిందువులు రెండు కళ్లుగా భావించి, అందరి అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ముస్లింలకు పింఛన్లు, ముస్లిం విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్లను తెరిచామని తెలిపారు. ముస్లిం యువత కోసం ప్రత్యేక ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, ఇది హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ సమీపంలో రానున్నట్లు వెల్లడించారు.
Read Also: Bulldozers roadshow: బుల్డోజర్లతో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం..
తెలంగాణ రాష్ట్రం శాంతియుతంగా ఉందని, కాంగ్రెస్ తన పదేళ్ల పాలనలో రూ. 2000 కోట్లను మైనారిటీల కోసం ఖర్చు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీల కోసం రూ. 12,000 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ సాధ్యమైందని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 24 గంటల కరెంటు ఉంటుందని, ఇంటింటికి కుళాయి నీరు వస్తుందని అన్నారు. సాగు, తాగు నీరు లేక గతంలో తెలంగాణ ఇబ్బందులను ఎదుర్కొందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తుందని అన్నారు. వ్యవసాయానికి రైతుబంధు ఇస్తున్నామని, కాంగ్రెస్‌కి రైతుబంధుకు ఇచ్చే డబ్బుల్ని వృథా అని విమర్శిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.10,000 సాయాన్ని క్రమంగా రూ.16,000కి పెంచుతామని తెలిపారు. ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని ఓటర్లకు సూచించారు.