తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ హయాంలో జరిగినన్ని అభివృద్ధి పనులు గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్‌లో మత్స్యకారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. హుజురాబాద్ ప్రజలు గతంలో ఈటెలకు ఓట్లు ఎందుకు వేశారో చెప్పాలని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా ఆయన ఏం చేశారని నిలదీశారు. గత రెండున్నర ఏళ్లలో బండి సంజయ్ తన పార్లమెంట్ నియోజక వర్గంలో ఎన్నడూ పర్యటించ లేదని.. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆయన హుజురాబాద్‌కు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని తలసాని ఆరోపించారు.
ఈటెలపై సీఎం కేసీఆర్ కక్ష కడితే రెండో సారి మంత్రి పదవి ఎందుకు ఇస్తారని తలసాని సూటిగా ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇంకా వారం సమయం ఉందని.. ఈటెల కావాలంటే మమ్మల్ని తిట్టుకోవచ్చన్నారు. కానీ ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసి హుజూరాబాద్ ప్రాంతానికి ఏదైనా ప్రాజెక్టు తీసుకురావాలని తలసాని సవాల్ విసిరారు. గెల్లు శ్రీనివాస్ యువకుడు అని, కానీ ప్రజలకు సేవ చేయడానికి సీనియర్ జూనియర్ అనేది అవసరం లేదన్నారు. దళిత బంధును ఈటెల గతంలో స్వాగతించారని.. ఇప్పుడు అడ్డుకుంటున్నారని తలసాని ఆరోపించారు. కేంద్రం ఇప్పటివరకూ తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదన్నారు. విపక్షాలు ఒకటి, రెండు ఇష్యూస్ పట్టుకుని కావాలనే హడావుడి చేస్తున్నాయని తలసాని ఫైరయ్యారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉందని.. కానీ ప్రభుత్వ శాఖల్లో రోస్టర్ ప్రకారం ఖాళీలు భర్తీ అవుతాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష 14 వేల ఉద్యోగాలు ఇచ్చిందని… కావాలంటే ఈ విషయాన్ని ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుని తెలుసుకోవచ్చని విపక్షాలకు హితవు పలికారు.