NTV Telugu Site icon

Telangana Crime: యువతి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌..! ప్రేమికుడి కోసం ఇంట్లో దోపిడీ.. అడ్డొచ్చిన అక్క హత్య..

Telangana Crime

Telangana Crime

Telangana Crime: ప్రేమికుడితో వెళ్లిపోవాలని ప్లాన్‌ వేసిన ఓ యువతి.. సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది.. అంతేకాదు.. అడ్డొచ్చిన అక్కను హతమార్చింది.. పారిపోయి ప్రేమికుడితో పెళ్లి చేసుకుందాం అనుకున్న ఓ చెల్లి ఆలోచన.. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బలో ఇటుక వ్యాపారం చేసే బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు.. 20 ఏళ్లుగా నివాసముంటున్నారు. వీరికి దీప్తి (24) చందన, సాయి ముగ్గురు పిల్లలు ఉన్నారు.. పెద్దకూతురు దీప్తి ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో గత ఏడాదిన్నరగా పనిచేస్తోంది.. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వర్క్‌ఫ్రమ్‌ హోం పద్దతిలోనే విధులు నిర్వహిస్తోంది దీప్తి. చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. సాయి బెంగళూరులో చదువుతున్నాడు. అయితే, శ్రీనివాస్ రెడ్డి బంధువుల గృహప్రవేశం హైదరాబాద్‌లో ఉండటంతో ఆదివారం భార్య మాధవితో కలిసి వెళ్లారు.. ఇంట్లో దీప్తి, చందన ఇద్దరే ఉన్నారు. రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులు ఇద్దరు కూతుర్లతో ఫోన్ మాట్లాడారు.. మర్నాడు మధ్యాహ్నం కూతుర్లకు ఫోన్ చేయగా పెద్దకూతురు దీప్తి ఫోన్ తీయకపోగా, చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.

వెంటనే ఇంటి ముందు నివాసమున్న వారికి ఫోన్ చేసి తమ కూతుర్లు ఫోన్ తీయడం లేదని తండ్రి ఫోన్ చేయగా.. ఇంటి ముందున్న వారు వెళ్లి తలుపులు తీసి చూడగా సోఫాలో దీప్తి మృతి చెంది ఉన్నట్టు గుర్తించారు.. చందన ఇంట్లో కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చందన అదృశ్యం కావడం.. దీప్తి చనిపోవడంతో కేసు మిస్టరీగా మారింది.. అయితే, వంట గదిలో రెండు మద్యం బాటిళ్లు, ఒక కూల్ డ్రింక్ బాటిల్, ఇతర తినుబండారాల ప్యాకెట్లు పోలీసులు కనుగొన్నారు.. ఆ దిశగా నాలుగు టీమ్ లను ఏర్పాటు చేసి విచారణ చేయగా ఇంట్లో బంగారం, డబ్బులు కూడా పోయినట్టు గుర్తించారు.. ఇది దొంగల పనా? అనే కోణంలోనూ విచారణ జరిపారు.. ఆగస్టు 28వ తేదీ రాత్రి దీప్తి మర్డర్ జరిగితే 29వ తేదీ మధ్యాహ్నం తర్వాతే అందరికీ తెలిసింది.. తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత విచారణను వేగవంతం చేశారు పోలీసులు..

అయితే, చిన్నకూతురు చందన కనిపించకపోవడంతో లవ్ ఎఫైర్ ఏమైనా? ఉందా అనే కోణం నుంచి దర్యాప్తు చేశారు.. నిందితుల కోసం రోడ్డుమార్గం.. సమీపంలో ఉన్నజాతీయ రహదారుల టోల్ గేట్ సీసీ కెమెరాలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు ఏదీ వదలకుండా లుక్కేసి ఉంచారు… మరోవైపు టెక్నికల్ టీం సభ్యులు రంగంలోకి దిగారు.. సెల్ టవర్ సిగ్నల్స్, దీప్తి ఫోన్, చందన ఫోన్ కాల్స్ పై దృష్టి సారించారు.. సరిగ్గా అదే సమయంలో ఆగస్టు 30వ తేదీన మృతురాలి తమ్ముడు సాయి సెల్‌ఫోన్‌కి చందన ఫోన్ నుంచి ఓ వాట్సాప్ వాయిస్ మెసేజ్ వచ్చింది.. అందులో తాను అక్కను హత్య చేయలేదు.. నేనెందుకు చంపుకుంటాను.. నన్ను నమ్మురా సాయి అంటూ చందన మాట్లాడిన మాటల రికార్డును పోలీసులకు ఇచ్చారు కుటుంబ సభ్యులు.. ఇక, ఫోన్ రికార్డుపై లుక్కేసిన పోలీసులకు చందన తన ప్రియుడితో ఉన్నట్టు తెలిసింది.. వారిని పట్టుకునేందుకు సాంకేతిక సాయం తీసుకుని ముందుకు కదిలిన పోలీసులు బృందాలు.. వారు ఒంగోలు సమీపంలోని ఓ లాడ్జీలో ఉన్నట్టు గుర్తించి.. అదుపులోకి తీసుకుని కోరుట్లకు తీసుకెళ్లారు.. నిందితులను గుర్తించేందుకు చందనతో పాటు ఆమె ప్రియుడు ఉమర్ ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటకి వచ్చాయి..

చందన బీటెక్ చదువుతున్న సమయంలోనే తనకు సీనియర్ అయిన ఉమర్ తో ప్రేమాయణం నడిపింది… వీరిద్దరి గురించి తెలుసుకున్న చందన తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు.. ఈ తరుణంలోనే.. అమ్మా నాన్నలు ఊరేళ్లడంతో దీప్తి, చందన ఇద్దరు అక్కచెల్లెళ్లు మాత్రమే ఇంట్లో ఉన్నారు.. ఇదే అదనుగా పారిపోయేందుకు ప్లాన్ వేసుకుంది చందన.. ఆ వ్యూహంలో భాగంగా అక్కతో మద్యం తాగించింది.. అంతకుముందే ప్రియుడికి కాల్ చేసి కోరుట్లకి రప్పించుకుంది.. అక్క దీప్తి మద్యం తాగి మత్తులోకి పోయిందని నిర్దారించుకున్న తర్వాత ప్రియుడు ఉమర్ కి సమాచారం ఇచ్చింది.. ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు సర్దుకుంటుండగా మెలుకువ వచ్చిన దీప్తి అడ్డుకునే ప్రయత్నం చేసింది.. దీంతో.. ఉమర్, చందన ఇద్దరూ కలిసి దీప్తి చేతులు నోరును చున్నీతో కట్టేసి బంధించారు.. అయినా శబ్ధం చేస్తుండటంతో దీప్తి నోటికి ప్లాస్టర్ వేశారు.. చీకట్లో నోరుతో పాటు ముక్కుకు ప్లాస్టర్ పడటంతో ఊపిరాడక దీప్తి మరణించింది.. అన్ని సర్దుకుని పారిపోయే ముందు ప్లాస్టర్ తొలగించి వెళ్లారు.. అప్పటికే దీప్తి ప్రాణాలు కోల్పోయింది.. ఇక, ఉమర్, చందన్‌ పారిపోయేందుకు సహకరించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.. 800 గ్రాముల బంగారం 1 లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.