Bandi Sanjay: కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మొత్తం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో కేంద్ర వాటా రూ.40 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని అన్నారు.
స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, అమృత్ తదితర వివిధ కేంద్ర పథకాల ద్వారానే కరీంనగర్ అభివృద్ధి జరుగుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కరీంనగర్ ప్రజలు గమనిస్తున్నారని అందుకే ఈసారి కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నేతలు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. టిక్కెట్ల కేటాయింపులో కాషాయ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు ఆయన. అవినీతి ఆరోపణలు లేదా రౌడీషీట్లు ఉన్నవారిని పార్టీలోకి తీసుకోమని తేల్చిచెప్పారు.
10,000mAh బ్యాటరీ క్లబ్ లోకి Realme P సిరీస్.. భారత్‌లో లాంచ్ అప్పుడే..!
కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. గాంధీ పేరును వాడుకున్నారే తప్ప మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కాంగ్రెస్ నేతలు పాతరేసి ఆయన ఆత్మను క్షోభకు గురిచేశారని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను గాంధీ వ్యతిరేకించారని గుర్తుచేశారు. అలాగే ఆయన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలపై స్పందించారు. రాముడి బాటలో నడుస్తామని, రాముడి ఆలయాలను నిర్మిస్తామని తాము చెప్పినప్పుడు కాంగ్రెస్‌కు నొప్పి ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. దేశంలో అనేక పథకాలు కేంద్ర – రాష్ట్ర భాగస్వామ్యంతోనే నడుస్తున్నాయని, ఈ పథకానికి రాష్ట్ర భాగస్వామ్యం కల్పిస్తే తప్పేముందని నిలదీశారు. ఉపాధి కూలీల వేతనాలను కూడా సకాలంలో ఇవ్వలేని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ తన ఇష్టానుసారంగా కొడుకు, కూతురు, అల్లుడి కోసం కుటుంబ ఆస్తులు పంచినట్లే జిల్లాల ఏర్పాటు చేశారని ఆరోపించారు. అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్‌కు ఎందుకు అక్కసు అని ప్రశ్నించిన బండి సంజయ్, గ్రామాల్లో ఆస్తులు నిర్మించడం తప్పా..? రైతులకు మేలు చేసే పథకం కాదా..? తెలంగాణకు అదనంగా రూ.340 కోట్లు వస్తుంటే వద్దంటారా..? అంటూ నిలదీశారు. వీబీజీ రామ్ జీ పథకం కావాలా..? వద్దా..? కాంగ్రెస్ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
Damodar Raja Narasimha: ఉగాది నాటికి సనత్‌నగర్ TIMS ప్రారంభం: పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తాం..!
ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాన్ని నీచ రాజకీయంగా ఆయన అభివర్ణించారు. వాల్మీకీ–అంబేద్కర్ ఆవాస్ యోజన (వాంబే) పేరుతో వాజ్‌పేయి తీసుకొచ్చిన ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. వాల్మీకీ, అంబేద్కర్ పేర్లు తొలగించి ఇందిరా ఆవాస్ యోజనగా ఎందుకు మార్చారని, ఇది ఆ మహానుభావులను అవమానించడమేనని విమర్శించారు. అలాగే గతంలో ఎన్టీఆర్ టెర్మినల్‌గా ఉన్న హైదరాబాద్ విమానాశ్రయ టెర్మినల్ పేరును తీసేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా ఎందుకు మార్చారని బండి సంజయ్ ప్రశ్నించారు.
