వివిధ కేసుల్లో సుమారు 40 కి పైగా నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ కాగా వాటినుండి తప్పించుకొనుటకు 15 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న, ఒక ఘరానా మోసగాడిని వెంటాడి , వేటాడి కటకటాల పాలు చేసిన కరీంనగర్ పోలీసులు !! ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన విలన్, ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడిన తర్వాత, ఆ జీవితంతో తృప్తి పడక, అధికంగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుడు కావాలనే దురాశతో, అనేక నేరాలు చేసి, ఆ నేరాల నుండి తప్పించుకొనుటకు అజ్ఞాతంలో ఉంటూ, భిక్షాటన చేసినా కూడా హీరో పాత్రలో ఉన్న పోలీస్ అధికారి వెంటాడి వేటాడి, ఆ విలన్ ను పట్టుకొని కటకటాల పాలు చేసినట్టుగా ఉన్నప్పటికీ ఇది కరీంనగర్ లో జరిగిన యదార్థ ఘటన.
నిందితుడి వివరాలు:-
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎన్.జీ.వో కాలనీ కి చెందిన కుందన శ్రీనివాసరావు అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శశాంక రావు అను నతడు ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు. తన తండ్రి టెలికాం డిపార్ట్మెంట్లో ఉన్నతోద్యోగి. తల్లిదండ్రులు అందించిన తోడ్పాటుతో కుందన శ్రీనివాసరావు విద్యాభ్యాసం చక్కగా జరిగి, 1991లో వరంగల్ లోని కిట్స్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం అతనికున్న తెలివితేటలతో అతనికి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ లాంటి కఠినమైన సబ్జెక్టుల మీద ఉన్న మంచి పట్టుతో కరీంనగర్ లోని ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా చేరి ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే వాడు. 2006 సంవత్సరం వరకు అతడు ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశాడు. ఇక్కడే అతని తెలివితేటలు వక్రీకరించి దురాశ అనే మొక్క అతని మెదట్లో పుట్టింది. విలాసవంతమైన జీవితం గడపడానికి తాను చేసే అధ్యాపక వృత్తి నుండి వచ్చిన ఆదాయం సరిపోదని భావించి తనకున్న తెలివితేటలతో ఏదో ఒక రకంగా అధికంగా డబ్బులు సంపాదించాలని ఆలోచించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడి కి మరి కొంత మంది తోడవగా నకిలీ కిసాన్ వికాస పత్రాలు సృష్టించి బ్యాంకులలో మార్ట్గేజ్ చేసి, వాటి ద్వారా బ్యాంకు లోను తీసుకొని బ్యాంకులకు బురిడీ కొట్టడం మొదలు పెట్టినారు. నిందితుడు కుందన శ్రీనివాసరావు మరియు అతని ముఠా సభ్యులు పలు బ్యాంకులను మోసగించి సుమారు కోటికి పైగా రూపాయలను రుణాలుగా పొందినారు. వారి మోసాలు గ్రహించిన తర్వాత బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కరీంనగర్, వరంగల్, హనుమకొండ హైదరాబాద్, గుంటూరు మొదలైన జిల్లాల లో పలు పోలీసు స్టేషన్లలో సుమారు 40 కి పైగా కేసులు నమోదు జరిగినవి. ఈ కేసుల్లో కుందన శ్రీనివాసరావును 2007 వ సంవత్సరంలో కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి అతని రిమాండ్ కు తరలించగా సుమారు ఒక సంవత్సరం పాటు అనగా 2008 వరకు కరీంనగర్ జైల్ లో గడిపినాడు. తర్వాత జైలు నుండి విడుదలై వివిధ పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసులలో ఇతర నిందితులకు జైలు శిక్షలు విధించబడగా, తనకు కూడా జైలు శిక్ష పడుతుందని భయంతో జైలు నుండి 2008 సంవత్సరంలో విడుదలైన నాటి నుండి అజ్ఞాత జీవితం ప్రారంభించాడు.
కూర శశాంక రావు తండ్రి పేరు గౌతమరావు అనే అవతారం ఎత్తి హైదరాబాదులో అజ్ఞాత జీవితం గడుపుతూ నకిలీ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లను సృష్టించి తరచుగా అతని చిరునామాలు మారుస్తూ హైదరాబాదులోని పలు ప్రైవేటు కాలేజీ లో మూడు సంవత్సరాల పాటు అధ్యాపకుడిగా పని చేసినాడు. అక్కడ నుండి వరంగల్ కు మకాం మార్చి కొంతకాలం అధ్యాపకుడిగా పని చేసినాడు. తర్వాత కుటుంబంలో తలెత్తిన వివాదంతో అతని భార్య అతని నుండి వెళ్ళిపోగా తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులను కూడా అమ్ముకొని శ్రీనివాస రావు తన మకాంను విజయవాడకు మార్చి నాడు. విజయవాడలో కొంతకాలం హోటల్లో పని చేసి అక్కడి నుండి తిరుపతికి తన మకాం మార్చి తిరుపతిలో హోటల్లో పని చేస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలో కుందన శ్రీనివాసరావుకి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి పోగా అతని జీవనం దుర్భరం అయింది. మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయిన శ్రీనివాస్ కి, గత్యంతరం లేక బిక్షాటన చేసుకోవడమే అతనికి జీవన ఆధారమైంది. పూట గడవడానికి అలిపిరి మెట్లమీద భిక్షాటన చేసుకుంటూ రోజులు గడిపాడు.
కుందెన శ్రీనివాసరావు తన కుటుంబంతో సంబంధాలను కోల్పోయి అజ్ఞాతంలో ఉండగా, బెంగుళురు లో సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్, 2018 లో వరంగల్ లో శ్రీనివాస అదృశ్యమైనట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా నిజామాబాదు లో కూడా శ్రీనివాస్ మిస్సింగ్ పై ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి లో భిక్షాటన చేస్తున్న శ్రీనివాస్ ను నిజామాబాద్ నుండి తీర్థయాత్ర కోసం తిరుపతి కి వెళ్ళిన కొంతమంది గమనించి, ఆ సమాచారాన్ని శ్రీనివాస రావు సోదరుడు కి చేరవేశారు. వెంటనే తిరుమల తిరుపతి చేరుకున్న శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ శ్రీనివాసరావు ను పట్టుకొని అతన్ని బెంగుళూరు కి తీసుకువెళ్లి అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పించాడు.
పట్టుబడిన విధం:-
సుమారు 15 సంవత్సరాలుగా 40కిపైగా కేసుల్లో నిందితుడైన శ్రీనివాసరావుపై కరీంనగర్ వరంగల్ గుంటూరు హైదరాబాద్ మొదలైన పలు చోట్ల న్యాయస్థానాలు అతన్ని అరెస్టు చేయుటకు నాన్ బెిలబుల్ వారెంట్ జారీ చేసి వున్నవి. ఇలా వివిధ కోర్టులలో పలు కేసులలో నిందితులపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ లలో ఉన్న నిందితులను వేటాడి పట్టుకొని చట్టం ముందు నిలబెట్టు టకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ఆపరేషన్ తలాశ్ పేరిట ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది.
ఈ క్రమంలో కుందన శ్రీనివాసరావుపై జారీ అయిన నాన్బెయిలబుల్ వారెంట్ లు కమిషనర్ దృష్టికి రాగా, ఛాలెంజ్ గా తీసుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ నిందితుడు కుందన శ్రీనివాస్ ను వెతికి పట్టుకొనుటకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కరీంనగర్ టౌన్ ఏ.సి.పి అశోక్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలు కమిషనర్ నుండి అందుకున్న కరీంనగర్ టౌన్ ఏ.సి.పి అశోక్ నిందితుడు శ్రీనివాసు ను వెతికి వేటాడి పట్టుకొనుటకు మెరికల్లాంటి పోలీస్ సిబ్బంది ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక సుదీర్ఘమైన అనుభవం గడించిన ఏ.ఎస్.ఐ సుజాత, కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుల్ రమేష్ మరియు సంపత్ అను వారితో ఆ ప్రత్యేక బృందం ఏర్పాటు అయినది. ప్రత్యేక బృందం అహర్నిశలు శ్రమిస్తూ శ్రీనివాస రావు కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలుసుకుంటూ అతని బంధువులు మిత్రులు అతడు పనిచేసిన స్థలాలను కూడా సందర్శించి, అతనికి సంబంధించిన విషయాలను ఆరా తీయడం మొదలు పెట్టినారు. కోర్టులో కుందన శ్రీనివాస్ కి జామీను పడ్డవారు. అతనికి సహకరించిన వారు, అతని కుటుంబ సభ్యులు, అతని తో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను కూడా కలిసి శ్రీనివాసరావు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఆరా తీయడం మొదలు పెట్టినారు. అంతేకాకుండా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ పై నిఘా వేసి వారి కుటుంబానికి వస్తున్న ఫోన్ కాల్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ సాంకేతిక పరిజ్ఞానంలో అపారమైన అనుభవం ఉన్న సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ లోని టెక్నికల్ ఎక్స్ పర్ట్స్స్ సహాయం కూడా తీసుకుంటూ కుందెన శ్రీనివాసరావు బంధుమిత్రుల కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా శ్రీనివాస రావు గతంలో వాడిన పాన్ కార్డ్స్ సేకరించి పాన్ కార్డు పై ఉన్న ఫోటో ఆధారంగా ఫోటోలు సంపాదించి ఆధార్ వెబ్ సైట్ లో రెండు ఫోటోలను సెర్చ్ చేయగా అతడు ఆధార్ కార్డు పొందిన సమయంలో వాడిన ఫోన్ నెంబర్లు సేకరించడం జరిగింది. అట్టి ఫోన్ కాల్స్ యొక్క డాటా ను పరిశీలించగా నిందితుడు శ్రీనివాస్ అందులో ఏ ఒక్క నెంబర్ను కూడా వినియోగించక పోగా ప్రత్యేక బృందం మళ్ళీ మొదటి నుండి తమ వేట ప్రారంభించడం జరిగింది. కుందన శ్రీనివాస్ వాడినట్టుగా అనుమానిస్తున్న మూడు ఫోన్ నెంబర్లలో వాడిన మొబైల్ ఫోన్ యొక్క ఐ ఎం ఈ ఐ సర్చ్ చేయగా నిందితుడు శ్రీనివాస్ ప్రస్తుతం వాదుతున్న ఫోన్ నెంబర్ దొరికింది. గత కొన్ని నెలలుగా శ్రీనివాస్ ను పట్టుకోవాలనే ధృడ సంకల్పం తో, సవాలుతో శ్రమిస్తున్న పోలీసు ప్రత్యేక బృందం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వారికి లభించిన ఫోన్ నెంబర్ పరిశీలించగా నిందితుడు శ్రీనివాస్ బెంగళూరులో ఉన్నట్టుగా గమనించి అతడు తరచుగా మాట్లాడుతున్న వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్ కూడా సేకరించి, వాటిపై కూడా నిఘా పెట్టగా నిందితుడు శ్రీనివాస్ గత కొంతకాలంగా బెంగళూరులోనే స్థిరంగా ఉన్నట్టు ఒక నిర్ణయానికి వచ్చారు.
వెంటనే ప్రత్యేక బృందానికి సారథ్యం వహిస్తున్న టౌన్ ఎ.సి.పి, అశోక్ తమ ప్రత్యేక బృందం సేకరించిన వివరాలను కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి కి వివరించగా వెంటనే బెంగుళూరు లో ఉన్న నిందితుడు శ్రీనివాస్ ను పట్టుకొనుటకు జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్చార్జి మురళి, ఏ.ఎస్.ఐ సుజాత, కానిస్టేబుల్ కృష్ణ కుమార్, కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ సంపత్ అని వారితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, వెంటనే బృందాన్ని బెంగుళూరు కి పంపించడం జరిగింది. బెంగళూరు కి వెళ్లిన ప్రత్యేక బృందం రెండు రోజులు బెంగళూరులో శ్రీనివాస్ కోసం అణువణువు గాలించగా, (15) సంవత్సరాలుగా పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలో ఉండి తప్పించుకుని తిరుగుతున్న కుందన శ్రీనివాస్ ఆచూకీ దొరికి, వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని కరీంనగర్ తిరుగు ప్రయాణమయ్యారు. నిందుతుడు కందెన శ్రీనివాస్ రావు నకిలీ పాన్ కార్డు మరియు నకిలీ ఆధార్ కార్డు సృష్రించి చలామణి అయినందున వాటిపై క్రిమినల్ కేసు నమోదు జరిగినది.