Air Pollution : కరీంనగర్‌లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..

  • కరీంనగర్ డంపింగ్ యార్డ్‌లో భారీగా మంటలు
  • దట్టమైన పొగతో స్థానికులకు శ్వాస సమస్యలు
  • ఇటీవలే కాలుష్యంపై కోతిరాంపూర్ ప్రజల ఆందోళన
  • మంటలను అదుపు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్
Karimnagar Dumping Yard

Karimnagar Dumping Yard

కరీంనగర్ నగరంలో కాలుష్య సమస్య మరోసారి తీవ్రరూపం దాల్చింది. నగర ప్రజలను తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్న కరీంనగర్ డంపింగ్ యార్డ్‌లో భారీగా మంటలు చెలరేగాయి. డంపింగ్ యార్డ్ అంతటా మంటలు వ్యాపించి రావణకాష్టంలా రగులుతుండటంతో వెలువడుతున్న దట్టమైన పొగతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితమే రోడ్డెక్కిన కోతిరాంపూర్ ప్రజలు

డంపింగ్ యార్డ్ నుంచి నిత్యం వెలువడుతున్న కాలుష్యం, పొగతో స్థానికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వారం రోజుల క్రితం ఇదే సమస్యపై కోతిరాంపూర్ ప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఏకంగా పవిత్రమైన దసరా పండుగ రోజున కూడా పండుగను పక్కనపెట్టి కుటుంబ సమేతంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. డంపింగ్ యార్డ్ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఏ విధమైన ప్రణాళికలు వేశారో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.

తీవ్రరూపం దాల్చిన మంటలు.. ఆందోళనలో నగరవాసులు

ప్రజల నిరసనలు చల్లారకముందే తాజాగా డంపింగ్ యార్డ్‌లో భారీగా మంటలు అంటుకోవడం కలకలం రేపింది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని, కళ్ళు మంటలతో ఉక్కిరిబిక్కిరవుతున్నామని వాపోతున్నారు.

ఇప్పటివరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో మున్సిపల్ యంత్రాంగం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి డంపింగ్ యార్డ్‌లో అంటుకున్న మంటలను అదుపులోకి తీసుకురావాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర కాలుష్య నివారణ ప్రణాళికను అమలు చేయాలని నగర ప్రజలు గట్టిగా కోరుతున్నారు.