Uttam Kumar Reddy : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక వెలువడిన నేపథ్యంలో, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నివేదికలోని అంశాలను ఎలాంటి మార్పులు చేయకుండా యధాతధంగా క్యాబినెట్‌కు సమర్పించామని ఆయన స్పష్టం చేశారు. “ఇందులో కల్పితాలు ఏవీ లేవు. ఆ సమయంలో తీసుకున్న ప్రతి నిర్ణయం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగింది,” అని తెలిపారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం నిర్మాణం ప్రభుత్వ నిర్ణయం కాదని, కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయమేనని ఆరోపించారు. “తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవు కాబట్టి మెడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించాల్సి వచ్చిందనే వాదన పూర్తిగా అబద్ధం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 205 టీఎంసీల నీరు ఉందని అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి స్పష్టంగా ప్రకటించారు,” అని పేర్కొన్నారు. ఘోష్ కమిషన్ కూడా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత ఉందని తేల్చిందని ఆయన అన్నారు.
అంతేకాక, మెడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టడాన్ని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కూడా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. “ఆ కమిటీ నివేదిక ప్రకారం అక్కడ కడితే డబ్బులు వృథా అవుతాయని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కేసీఆర్ నిర్ణయాన్ని బలవంతంగా అమలు చేశారు,” అని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజా ధనం ఇష్టానుసారంగా దుర్వినియోగం జరిగిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. “రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శాశ్వతంగా ప్రమాదంలో పడేలా నిధులను ఖర్చు చేశారు. కాంట్రాక్టర్లకు ఫెవర్ చేసేలా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించారు. ఇది బిజినెస్ రూల్స్‌కు విరుద్ధం,” అని వ్యాఖ్యానించారు.
Tollywood: తెలుగు సినిమాల్లో పనిచేయాలని ఉందా.. మీకు ఇదే గోల్డెన్ చాన్స్!
ఘోష్ కమిషన్ నివేదికలో మరో ముఖ్యమైన అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. “కాళేశ్వరం కోసం 2,591 కోట్లు ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి క్యాబినెట్‌లో చర్చించకుండా ఆమోదించారు. నోట్ ఫైల్‌పై క్యాబినెట్ సెక్రటరీ, ముఖ్యమంత్రి సంతకాలు ఉన్నా క్యాబినెట్ ఆమోదం లేకపోవడం చాలా పెద్ద తప్పు,” అని తెలిపారు.
ప్రాజెక్టు లక్ష్యం ప్రజల ప్రయోజనం కోసం కాకుండా రాజకీయ ప్రచారం కోసం మార్చారని ఆరోపించారు. “బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసుకోవడమే కాదు, ఫోటోలు తీసుకుని ‘గోదావరి జలకళ’ అని ప్రచారం చేశారు. ప్రతి చిన్న విషయంలో కేసీఆర్ రాజకీయ జోక్యం చేసుకోవడం వల్లే మూడు బ్యారేజీలు కూలిపోయాయి,” అని ఘోష్ కమిషన్ తేల్చిందని ఆయన అన్నారు.
“రీ-ఇంజనీరింగ్ నిర్ణయం కూడా కేసీఆర్ ఒక్కరే తీసుకున్నారు. దాని ఫలితంగా ఈ భారీ అవకతవకలు జరిగాయి. ఆ సమయంలో ఇరిగేషన్ మంత్రి కూడా పట్టించుకోలేదు,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
Shubman Gill: అతడు ఓ అద్భుతం.. విజయానికి మేము అన్ని విధాలా ఆర్హులం!
