NTV Telugu Site icon

Kakatiya Utsavalu : కాకతీయ ఉత్సవాలకు సిద్ధమైన ఓరుగల్లు

Kakatiya Utsavalu

Kakatiya Utsavalu

చారిత్రక వరంగల్‌ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ వారోత్సవాలను నిర్వహించబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు వరంగల్‌లో కాకతీయుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ‘కాకతీయ సప్తాహం’ పేరున ఈ నెల ఏడవ తేదీనుండి వారం రోజులపాటు అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. కాకతీయ ఉత్సవాలకు కాకతీయ వంశానికి చెందిన 22వ వారసుడు అయినా కమల్‌చంద్ర బాంజ్‌దేవ్‌ పాల్గొననున్నారు.

Read Also: RajyaSabha: రాజ్య‌స‌భ‌లో తెలుగు సినీజ‌నం!

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2012 డిసెంబర్‌ 21నుండి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017-18ల్లో ‘ఓరుగల్లు కళావైభవం’పేర ఉత్సవాలు కొనసాగాయి. అనంతర కాలంలో రామప్ప దేవాలయం నిర్మించి ఎనిమిది వందల సంవత్సరాలు అయిన సందర్భంలో ఉత్సవాలు జరిపారు. తాజాగా కాకతీయ సప్తాహం పేరున మరోసారి ఇప్పుడు జూలై ఏడు నుండి పదమూడవ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను నాటి కాకతీయ రాజధాని ఓరుగల్లు ఖిల్లాలో టూరిజం శాఖమంత్రి శ్రీనివాసగౌడ్‌, మంత్రి సత్యవతిరాథోడ్‌, చీప్‌విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎంపి సంతోష్‌కుమార్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధలు కలిసి ప్రారంభించనున్నారు. కాకతీయులు మట్టికోట, పుట్టకోట అంటూ ఏడు ప్రాకారాలతో కోట నిర్మాణం చేసుకున్నారు. దాని గుర్తుగా ఏడు కోటల పరిధిలో ఉత్సవాలను నిర్వహించ తలపెట్టారు. ఈ సందర్భంగా పేరిణి నృత్యాలు, కోలాటాలు సాహితీ సమావేశాలు, సెమినార్‌లను నిర్వహించనున్నారు.