NTV Telugu Site icon

Kadiyam Srihari: కడియం ఆసక్తికర వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చండి..!

Kadiyam Ktr

Kadiyam Ktr

Kadiyam Srihari: తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ప్రయాణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజమైన రాజకీయ పార్టీగా మారి… పదేళ్లపాటు తెలంగాణను పాలించింది. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారి జాతీయ రాజకీయాలకు సిద్ధమైంది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ సెంటిమెంట్ పార్టీకి దూరమైందని… గత అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం పడిందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీంతో బీఆర్‌ఎస్‌ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలన్న డిమాండ్‌ మొదలైంది. వరంగల్ లోక్ సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుంచారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను సొంత పార్టీగా భావించారని కానీ.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించడం సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని కడియం అన్నారు. టీఆర్‌ఎస్‌తో ప్రజలకు అనుబంధం ఉండేదని, బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఆ సెంటిమెంట్, అటాచ్‌మెంట్ పోయిందన్నారు.

Read also: Ram Mandir : రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎల్ కే అద్వానీ

కాబట్టి ప్రజలు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్‌ను తిరిగి టీఆర్‌ఎస్‌లోకి మార్చే విషయంలో పునరాలోచించాలని కేటీఆర్‌ను కడియం కోరారు. పార్టీ పేరుతో తెలంగాణను తొలగించడం వల్ల గత ఎన్నికల్లో నష్టం వాటిల్లిందని దీనివల్ల కనీసం 1-2 శాతం ఓట్లు గల్లంతయ్యాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని కడియం పేర్కొన్నారు. పార్టీలో కలసి వచ్చిన తెలంగాణ సెంటిమెంట్‌ను దూరం చేయడం మంచిది కాదని, బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి మార్చాలని పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని కడియం శ్రీహరి అన్నారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ను నిలబెట్టాలని, తెలంగాణలో టీఆర్ఎస్ ను కొనసాగించాలని కడియం సూచించారు. ఈ వ్యవహారంలో న్యాయపరమైన అంశాలు ఏమైనా ఉంటే వినోద్ కుమార్ వంటి పార్టీ నేతలు పరిశీలించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ను తిరిగి పార్టీ పేరుతో చేర్చే అంశాన్ని అధినేత కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని కడియం శ్రీహరి పార్టీ నేతలను కోరారు. మరి త్వరలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా మార్చే సూచలు కనిపిస్తున్నాయి. మరీ దీని మాజీ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
CM Revanth Reddy: పెట్టుబడులకు అవకాశం ఉంది..13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి