రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కే. లక్ష్మణ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన లక్ష్మణ్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీ అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి ఆయనకు లేదని విమర్శించారు. టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, ఎంఐఎంకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. టీఆర్ఎస్‌లో వెన్నుపోటు పొడిచేందుకు కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, ఈ కట్టప్పల విషయంలో తమ బీజేపీది ప్రేక్షయపాత్ర మాత్రమేనని వ్యాఖ్యానించారు. బీజేపీలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేరిక ఒక ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని తెలిపారు.
కాగా.. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ్యకు ఎన్నికైన కే. లక్ష్మణ్, తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తానని.. తెలంగాణ వాదనను వినిపించడానికే తనను యూపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారన్నారన్నారు. ఇది తెలంగాణపై జాతీయ నాయకత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తనకు దక్కిన ఈ రాజ్యసభ అవకాశం.. కార్యకర్తలకు దక్కిన గుర్తింపుగా పేర్కొన్నారు. అనేక పదవుల్లో వెనుకబడిన వర్గాలకు బీజేపీ ప్రత్యేక గుర్తింపు ఇస్తోందని.. రాష్ట్రపతి కోటాలో దక్షిణాదికి పెద్దపీట వేస్తూ, నలుగురిని రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేసిందన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ పేదలకు ప్రాధాన్యమిస్తుందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.