తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ‘జల యుద్ధం’ పీక్ స్టేజ్‌కి చేరింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుకొని కృష్ణా జలాల కేటాయింపుల వరకు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో ఎవరు అబద్ధాలు చెబుతున్నారు? ఎవరు వాస్తవాలను దాస్తున్నారు? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
తాజాగా ఈ అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రమ్మంటే.. మైక్ ఇవ్వలేదనే చిన్న నెపంతో అసెంబ్లీని బహిష్కరించి పారిపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి?” అని ఆయన నిలదీశారు. ప్రాజెక్టుల క్రెడిట్ విషయంలో కేసీఆర్ అండ్ టీమ్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన కొట్టిపారేశారు.
Sarfaraz Khan: దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదుగా.. పాపం సర్ఫరాజ్ ఖాన్!
తెలంగాణ ప్రాజెక్టులపై అసెంబ్లీ వేదికగా జరుగుతున్న చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాక రేపుతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంతా ఒక డ్రామా అని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు ప్రజలను కేవలం ఓటు బ్యాంకులాగే వాడుకుందని, ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి చేసుకున్నాయని.. కేవలం మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్ల సమయం పట్టిందని జూపల్లి ఎద్దేవా చేశారు. అన్నీ తామే చేశామని కేసీఆర్ ఫ్యామిలీ చెప్పుకోవడం ఆత్మవంచన అని ఆయన విమర్శించారు.
అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని బీఆర్ఎస్ బహిష్కరించడంపై జూపల్లి సూటి ప్రశ్నలు సంధించారు. కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు రమ్మని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినప్పుడు.. చర్చకు రాకుండా పారిపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. సభలోకి వచ్చి చర్చలో పాల్గొంటే.. గత పదేళ్లలో జరిగిన ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరిట జరిగిన అవినీతి, నీటి కేటాయింపుల్లో చేసిన పొరపాట్లు బట్టబయలవుతాయనే భయంతోనే కేసీఆర్ అండ్ బృందం సభకు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
గతంలో మైక్ ఇవ్వని సందర్భాలు వందలాది ఉన్నాయని.. అంతమాత్రాన ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని బహిష్కరించడం అంటే ప్రజల గొంతును నొక్కడమేనని జూపల్లి స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చుని సభలు పెడతా అని చెప్పడం కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి వాస్తవాలు మాట్లాడాలని సవాల్ విసిరారు. మొత్తానికి ప్రాజెక్టుల విషయంలో అబద్ధాలు చెబుతున్నది ఎవరో ప్రజలకు తెలుసని, త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.
