Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్‌లో నేడు బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో.. భారత్ జోడో గర్జన పేరుతో లక్ష మందితో ఈసభను తలపెట్టారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందుకుతగిన సన్నాహాలు చేస్తున్నారు..ఈ సభతో తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర పూరై మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. ఇక, 119 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సభకు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, జోడో యాత్ర ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడ్‌పగల్ మండలానికి చేరుకుంది. రాహుల్ ఇక్కడే బస చేశారు. ఇవాళ జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఫతాలపూర్ గేటు నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. ఇక మేనూరు వరకు 20 కి.మీ. మేర యాత్ర చేస్తారు. మరోవైపు ఈ నెల 2న సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర ఆదివారంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ముగిసింది. ఈయాత్ర 5 రోజుల పాటు 130 కిలోమీటర్ల మేర నడిచారు. ఇక.. ఆదివారం అల్లాదుర్గం మండలం రాంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ వరకు నడిచారు. సాయంత్రం 4 గంటలకు సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు వాహనంలో రాహుల్ బయల్దేరారు. కాగా..అక్కడినుంచి బాచేపల్లి, మహదేవునిపల్లి మీదుగా మాసాన్‌పల్లి వరకు పాదయాత్ర సాగింది. తదనంతరం పెద్దకొడ్‌పగల్ గ్రామానికి వెళ్లారు.