Jangaon : జనగామ జిల్లాలో ఒక సామాన్య రైతు పడుతున్న కష్టాలు, అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. తన పొలం ఎండిపోతుంటే తట్టుకోలేక, ఒక రైతు ఏకంగా జిల్లా కలెక్టర్ కాళ్లు మొక్కి తన సమస్యను పరిష్కరించాలని వేడుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లాలోని ఒక గ్రోమోర్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న యూరియా రికార్డులను , నిల్వలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎర్రగొల్ల పహాడ్ గ్రామానికి చెందిన అజ్మీరా రవి అనే రైతు కలెక్టర్ దగ్గరకు చేరుకున్నారు. తన గోడును అధికారులకు వినిపించే క్రమంలో ఒక్కసారిగా తీవ్ర ఆవేదనకు లోనై, కలెక్టర్ కాళ్లు పట్టుకుని రోదించారు.
రైతు అజ్మీరా రవి తన పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి నెల రోజులు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, సాగునీరు అందక చేతికందాల్సిన పంట కళ్లముందే ఎండిపోతోందని కలెక్టర్ వద్ద వాపోయారు. “మా సమస్యను మీరే పరిష్కరించాలి” అంటూ ఆయన కలెక్టర్ కాళ్లు పట్టుకుని వేడుకోవడం అక్కడున్న వారందరినీ చలింపజేసింది. రైతు పడుతున్న కష్టాన్ని చూసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తక్షణమే స్పందించారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, ఆ రైతు పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారుల పనితీరుపై చర్చకు దారితీసింది. క్షేత్రస్థాయిలో రైతులు తమ చిన్న సమస్యల కోసం కూడా ఉన్నతాధికారుల కాళ్లు మొక్కడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
New Year 2026: “న్యూ ఇయర్” ఏ దేశంలో ముందు, ఏ దేశంలో చివరగా వస్తుందో తెలుసా..
