Site icon NTV Telugu

Pawan Kalyan: నిత్య చైతన్య దీప్తి తెలంగాణ.. చైతన్యానికి నెలవు, విప్లవాలకు కొలువు..

Pawan Kalyan

Pawan Kalyan

సెప్టెంబర్‌ 17వ తేదీకి తెలంగాణలో ఓ ప్రత్యేక స్థానం ఉంది.. ఓ చరిత్ర ఉంది.. ఎంతో మంది త్యాగాలున్నాయి… ఆ సందర్భాన్ని పురస్కరించుకుని.. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. నిత్య చైతన్య దీప్తి తెలంగాణ.. చైతన్యానికి నెలవు, విప్లవాలకు కొలువు అంటూ ప్రశంసలు కురిపించారు.. ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ అని పేర్కొన్న ఆయన.. అటువంటి ఈ పుణ్యభూమికి సంపూర్ణ స్వేచ్ఛ లభించిన రోజు సెప్టెంబర్ 17 అని.. దీనిని విమోచన అనండి లేదా విలీనం అనండి.. ఏ పేరుతో పిలిచినా సరే.. ఈ రోజు మాత్రం చారిత్రాత్మక శుభ దినం అని పేర్కొన్నారు జనసేనాని.

Read Also: CM KCR: మీ అందరికీ చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే

ప్రజలకు బానిస సంకెళ్లు తొలగిన మరపురాని రోజు సెప్టెంబర్‌ 17… తెలంగాణ వాసులందరికీ పండుగ రోజు.. ఈ శుభ తరుణంలో 75వ విమోచన దినోత్సవం జరుపుకొంటున్న శుభ తరుణాన తెలంగాణ బిడ్డలందరికీ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ ప్రకటనలో పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌… నిరంకుశ పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లి విముక్తి కోసం అశువులు ధారబోసిన వీరులకు ప్రణామాలు అర్పిస్తున్నాను… ఈ గడ్డలోని అనువణువునా నిక్షిప్తమైన పోరాట తత్త్వం, అన్యాయాలపై గళమెత్తే గుండె ధైర్యమే ఈ నేలకు సర్వదా రక్ష… తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది కళకళలాడాలని, ప్రజలు సుఖశాంతులు, సంపదలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Exit mobile version