Dharmapuri Election Issue: జగిత్యాల జిల్లా నేడు ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారి విచారించనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. 2018లో ధర్మపురి ఎన్నికల్లో పనిచేసిన అధికారులను ఢిల్లీ నుంచి ఈసీ అధికారులు విచారించనున్నారు. విచారణకు హాజరుకావాలని అప్పటి ఎన్నికల అధికారులకు ఈసీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది.
గత ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయి అంటూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే గత వారం క్రితం విచారణ చేపట్టిన అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళాలు దొరకడం లేదని కోర్టుకు నివేదించారు. తాళాలు లేకపోవడం వల్ల స్ట్రాంగ్ రూం తెరవకపోవడం పై హైకోర్టు ఆదేశానుసారం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం రోజున (12-04-2023) హైదరాబాద్ లోని హైకోర్టుకు హాజరై సోమవారం రోజున వి.అర్.కే కళాశాల స్ట్రాంగ్ రూం వద్ద జరిగిన విషయాన్నంత వ్రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించడం జరిగింది. తాళాలు మాయమవ్వడం పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్ట్రాంగ్ రూం తాళాలు లేకపోవడం పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను హై కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు JNTU యూనివర్సిటీ కాలేజ్ (నాచుపల్లి, కొడిమ్యాల మండలం ) లో ఉదయం 11 గంటలకు సంబంధిత పత్రాలతో విచారణకు హాజరు కావాలని అప్పటి జిల్లా ఎన్నికల అధికారి, డిప్యూటీ ఎన్నికల అధికారికి ఎలక్షన్ కమీషన్ ఉత్తర్వులను జారీ చేసింది.
అసలేం జరిగింది..
2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేశారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు అనంతరం కొప్పుల ఈశ్వర్ అతి తక్కువ మెజారిటీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే సరైన లెక్కలు లేకుండానే విజయాన్ని ప్రకటించారని కాంగ్రెస్ నేతలు అప్పట్లో హడావుడి చేశారు. రెండో స్థానంలో నిలిచిన లక్ష్మణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని అప్పట్లో ప్రకటించారు. సీనియర్ నాయకుడిగా పేరొందిన కొప్పుల ఈశ్వర్ ఓటమి భయంతోనే గెలుపు కోసం అడ్డంకులు తొక్కుతున్నారని అడ్లూరు లక్ష్మణ్ ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరగడంతో ఎన్నో ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో పోటీ చేశారని, అయితే చివరి నిమిషంలో ఓడిపోతామనే భయంతో అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వెళ్లి గెలుపొందారని ఆరోపించారు. ఇంత చేసినా కేవలం 441 ఓట్ల మెజారిటీ రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వీవీ ప్యాట్లకు వచ్చిన ఓట్ల లెక్కింపునకు ముందు కొప్పుల ఈశ్వర్ పేరును అధికారులు ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది.