Jagtial Adoption Case : జగిత్యాల బాలుడి దత్తత కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టుకు కలెక్టర్

  • బాలుడిని తల్లిదండ్రుల నుంచి తిరిగి తీసుకోవాలని పిటిషన్
  • గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే కోరిన అధికారులు
  • దత్తత చట్టబద్ధతపై లోతైన విచారణ జరపాలని విజ్ఞప్తి
  • సీడబ్ల్యూసీ సంరక్షణకు అప్పగించాలని హైకోర్టును కోరిన కలెక్టర్
Jagtial Adoption Case

Jagtial Adoption Case

జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపిన మూడేళ్ల బాలుడి చట్టబద్ధమైన దత్తత వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలని, విచారణ పూర్తయ్యే వరకు ఆ బాలుడిని తిరిగి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సంరక్షణకు అప్పగించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ , సీడబ్ల్యూసీ అధికారులు ఉమ్మడిగా హైకోర్టును ఆశ్రయించారు.

సోషల్ మీడియా వీడియో వైరల్.. తల్లిదండ్రులకు అప్పగింత

చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదన్న వివాదంతో అధికారుల నుంచి తమ మూడేళ్ల బాలుడిని విడదీయడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బాలుడు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అక్టోబర్ 16న హైకోర్టు ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల అమల్లో అధికారులు జాప్యం చేశారనే విమర్శలు కూడా వచ్చాయి.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రిట్ పిటిషన్

తాజాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కలెక్టర్ సత్యప్రసాద్ , సీడబ్ల్యూసీ అధికారులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీడబ్ల్యూసీ సమర్పించిన ఆధారాలు, నిబంధనలను పరిశీలించకుండానే గతంలో ఆ ఉత్తర్వులు ఇచ్చారని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు. కేవలం హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన దత్తతను చట్టపరమైన దత్తత ప్రక్రియగా పరిగణించవచ్చా అనే అంశంపై లోతుగా పరిశీలించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

CWC సంరక్షణకే బాలుడిని అప్పగించాలని విజ్ఞప్తి

ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ సజావుగా సాగడానికి, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు బాలుడిని తిరిగి సీడబ్ల్యూసీ కేంద్రానికే అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులు కోరారు. బాలుడిని తల్లిదండ్రుల వద్దే ఉంచాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై తక్షణమే స్టే విధించాలని జగిత్యాల కలెక్టర్ , సీడబ్ల్యూసీ అధికారులు పిటిషన్‌లో స్పష్టం చేశారు. దీంతో ఈ జగిత్యాల దత్తత వివాదంపై హైకోర్టు తదుపరి ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.