NTV Telugu Site icon

Jaggareddy: ఎక్కడ రామ మందిరం ఉందో అక్కడే చిచ్చు మొదలైంది

Jaggareddy

Jaggareddy

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం  తీసుకువచ్చిన  ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్’పై నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వం సం చేశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వయోపరిమితి సడలింపుతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అగ్నిపథ్ కు వ్యతిరేఖంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షను ప్రారంభించింది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ  విధానాలను కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. బీజేపీ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మోదీ వల్లనే దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎక్కడ రామ మందిరం ఉందో అక్కడే చిచ్చు మొదలైందన్నారు. ఆర్మీలో దేశ సేవ చెద్ధాం అనుకునే యువతకు ఉద్యోగాలు రాకుండా చేసే ప్రయత్నం జరగుతోందని ఆరోపించారు.

సికింద్రాబాద్ అల్లర్లలో మరణించిన రాకేష్ మరణానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. రాకేష్ ను బీజేపీ పోలీసులు కాల్చారా..లేక టీఆర్ఎస్ పోలీసులు కాల్చారా..? అని అడిగారు. బీజేపీ కంట్రోల్ లో ఉన్న పోలీసులే కాల్చారని జగ్గారెడ్డి అన్నారు. డెడ్ బాడీపై టీఆర్ఎస్ కండువా కప్పేసి రాజకీయం చేస్తుందని విమర్శించారు. బీజేపీ చంపుతుంది, టీఆర్ఎస్ శవయాత్ర చేసి రాజకీయం చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఇలాంటి రాజకీయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన అన్నారు. పోలీసుల కాల్పులకు బలికావద్దని.. అధికారంలోకి వచ్చాక సోనియా గాంధీ మిమ్మల్ని కాపాడుకుంటుందని జగ్గారెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు సోనియా గాంధీ అండగా ఉంటారని అన్నారు. స్వాతంత్రదేశంలో ఎప్పుడూ కూడా సికింద్రాబాద్ లో ఇంత పెద్ద ఘటన చోటు చేసుకోలేదని అన్నారు.