Jagadish Reddy Reveals Why BJP Attacking Telangana: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న పథకాలు చూసి, దేశ ప్రజలంతా అడుగుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి పథకాలు తమ రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రధాని మోడీని ప్రజలు అడుగుతున్నారని, మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ఆ కక్షతోనే బీజేపీ వాళ్లు తెలంగాణపై దాడికి దిగారని మంత్రి వివరించారు. బీజేపీ వాళ్లకు గ్రామాల్లో సరైన సమాధానం చెప్పాలని, టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లాలోని చండూర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. ఎన్నికల్లో చెప్పిన మ్యానిఫెస్టోతో పాటు చెప్పని హామీల్ని సైతం అమలు చేసి, ప్రజల మనసును గెలిచిన ఏకైకా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి జగదీశ్ పేర్కొన్నారు. రాష్టానికి తండ్రిగా అన్ని తానై సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, మానవత్వంతో పాలన చేస్తున్నారని, ఇచ్చిన ప్రతీ మాటని నిలబెట్టుకున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. ఆకలి అన్నదే లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారన్నారు. దేశంలో 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన ఆయన.. ఇంతకుముందు నీళ్ల కోసం కూడా తంటాలు పడ్డామని, ఇప్పుడు భగీరథతో తాగు నీటి గోస తీరిందని చెప్పారు. దేశంలోనే అత్యంత ఎక్కువ వ్యవసాయ దిగుబడులు సాధిస్తోంది నల్లగొండ జిల్లానే అన్నారు. ఫ్లోరైడ్ భూతాన్ని పూర్తి అంతం చేశామని, స్వయంగా కేంద్రమే తెలంగాణలో ఒక్క ఫ్లోరైడ్ కేసు నమోదు కాలేదని ప్రకటించిందని వెల్లడించారు. ఇది కేసీఆర్ దర్శనికతతోనే సాధ్యమైందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.
