Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!

Omega Hospitals It Raids

Omega Hospitals It Raids

ప్రముఖ క్యాన్సర్ చికిత్స సేవల నెట్‌వర్క్ ఒమేగా హాస్పిటల్స్‌పై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు మెరుపు దాడులకు దిగారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 ప్రాంతాల్లోని ఒమేగా ఆసుపత్రి శాఖలతో పాటు యాజమాన్యానికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ఒమేగా హాస్పిటల్స్ శాఖల్లో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆసుపత్రుల అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు, ఫైనాన్స్ విభాగాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

ఆసుపత్రి బ్రాంచీలతో పాటు పలువురు కీలక వైద్యులు, యాజమాన్య ప్రతినిధుల ఇళ్లపై కూడా ఐటీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు, అనధికార నగదు లావాదేవీలు జరిగినట్లు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల రికార్డులు, డిజిటల్ హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు అకౌంట్స్ బుక్స్, హాస్పిటల్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ డేటాను పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతుండటంతో వైద్య రంగ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.