Indrakaran Reddy Says Central Government Not Given Funds For Telangana Floods: తెలంగాణ వరద సాయం అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాడీవేడీ రాజకీయాలు జరుగుతున్నాయి. కేంద్రం సహకారం అందిస్తోందని బీజేపీ నేతలు చెప్తొంటే, టీఆర్ఎస్ నేతలు మాత్రం కేంద్రం కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోవట్లేదని ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. వరద సాయం కోరినా, కేంద్రం స్పందించడం లేదని అన్నారు. తక్షణ సహాయంగా రూ.1000 కోట్లు ఇవ్వాలని తాము కోరామని.. కానీ ఇంతవరకూ కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాల నుంచి కేంద్రం వివిధ రాష్ట్రాలకు వరద సహాయం అందిస్తోందని, తెలంగాణకు మాత్రం రూపాయి ఇవ్వలేదని ఆగ్రహించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్రాలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం.. తన బాధ్యతను విస్మరిస్తోందని దుయ్యబట్టారు. ఆర్థిక సహాయం అందించాల్సింది పోయి.. ఇంకా పాలు, పప్పు, ఉప్పులపై జీఎస్టీ రూపంలో సామాన్యుల మీద పన్నుల భారం మోపుతోందని ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా.. వరద సాయం విషయంపై రెండ్రోజుల క్రితం కిషన్ రెడ్డి, కేటీఆర్ మధ్య కూడా వాదోపవాదనలు జరిగాయి. కేంద్రం వరద సాయం అందిస్తోందని కిషన్ రెడ్డి చెప్పిన లెక్కల్ని కేటీఆర్ తూర్పార పట్టారు. అసలు కిషన్ రెడ్డి ఎన్‌డీఆర్ఎఫ్(NDRF), ఎస్‌డీఆర్ఎఫ్(SDRF) మధ్య తేడా తెలియదని.. అలాంటి వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండటం నిజంగా దురదృష్టకరమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎస్‌డీఆర్ఎఫ్ నుంచి రాజ్యాంగబద్ధంగా సాయం అందుతోందని, కానీ కేంద్రం ప్రత్యేకంగా ఇస్తోందంటూ తప్పుడు లెక్కలు చెప్తూ కిషన్ రెడ్డి గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు మినహాయిస్తే.. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందలేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం దక్కాయో కిషన్ రెడ్డి లెక్కలు చెప్పాల్సిందేనని కేటీఆర్ నిలదీశారు.