Site icon NTV Telugu

గులాబీకి గుబులు పుట్టిస్తా…!

indira-shoban

indira-shoban

ఇది పాదయాత్రల సీజన్‌. తెలంగాణలో మరో పాదయాత్రకు ముహూర్తం కుదిరింది. ఇందిరా శోభన్‌ తాజాగా ఈ లిస్టులో చేరిపోయారు. ఇటీవలషర్మిల పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆమె మీడియా ముందుకు వచ్చారు. తన ఫ్యూచర్‌ ప్లాన్‌ ఏమిటో వివరించారు. ముందు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటమే ఆమె టార్గెట్‌. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానలపైనే తన పోరాటమంటున్నారు ఇందిరా శోభన్‌. ఆమె తలపెట్టిన పాదయాత్ర పేరు ఉపాధి భరోసా యాత్ర.

కేసీఆర్‌ సర్కార్‌ పుణ్యమా అని ఎంతో మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారని ఇందిర ఆరోపించారు. కొత్త కొలువులు లేవు.. పైగా వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు , నర్సులు, గెస్ట్‌ లెక్చరర్లు ..ఇలా అన్ని రంగాలకు చెందిన వారు వేల సంఖ్యలో తమ ఉపాధి కోల్పోయారు. వీరికి మద్దతుగా ఈనెల 27నుంచి ఈ ఉపాధి భరోసా యాత్ర చేపడుతున్నారు.

షర్మిల పార్టీతో తెగ తెంపులయ్యాక ఆమె ఏ పార్టీలో చేరనున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారనే వార్తలూ బలంగా వినిపించాయి. రేవంత్‌ రెడ్డి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారని..అందుకే ఈ ఊహాగానాలన్నది కొందరి వాదన. రేవంత్‌ పీసీసీ పీఠం ఎక్కక ముందు కాంగ్రెస్‌తోనే ఉన్నారామె. అయితే అప్పుడు హస్తం పార్టీ పరిస్థితి వేరు..అంతా గందరగోళం. నాటి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో ఆమె కెమిస్ట్రీ కుదరలేదు. ఆయన కారణంగానే కాంగ్రెస్‌ని వీడానని కూడా చెప్పారామె.

కాంగ్రెస్‌కు టాటా చెప్పి షర్మిల పక్కన నిలిచారు. అన్నీ తానై ఆమె పార్టీ కోసం పనిచేశారు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు..ఉన్నట్టుండి రాజన్న కూతురుతో కటీఫ్‌ అయ్యింది. తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అందుకే వచ్చేశానని ఇందిర అప్పుడు చెప్పారు..అయితే రేవంత్‌ ప్రోత్సాహం వల్లే ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారన్నది కొందరి మాట. ఆమె త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆమె వాటికి తెరదించింది.

తానకు ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని ఇందిరా శోభన్‌ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు తాను ఏ పార్టీలో చేరాలన్నది ముఖ్యం కాదని .. ప్రజా సమస్యలే అజెండా పనిచేస్తానని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్దమవుతున్నానన్నారు. ముందు హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమి తన ధ్యేయమని ప్రకటించారు. కేసీఆర్‌ పాలనపై నిప్పులు చెరిగారు. హరీష్ రావు భుజాలపై తుపాకీ పెట్టి ఈటల రాజేందర్‌ను కాల్చాలనుకుంటున్నారని కేసీఆర్ మీద మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలు కేటీఆర్‌కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.దీనిపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారామె.

ఇదిలావుంటే, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేసే ప్రసక్తే లేదని చెప్పారు ఇందిరా శోభన్‌. నిరుద్యోగుల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానన్నారు. ఏడేళ్లలో నాలుగు లక్షలు అప్పు చేశాడు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చాడు. ఈ ఘనత కేసీఆర్, హరీష్‌రావుదే అని ఎద్దేవా చేశారు. అందుకే తన టార్గెట్‌ హుజూరాబాద్‌ అన్నారామె. గులాబీ పార్టీ ఓటమే లక్ష్యమ‌ని చెప్పారు. ఇద్దరు వ్యక్తుల కోసం వచ్చిన ఎన్నిక ఇది. ఇక్కడ గెలవటం కేసీఆర్‌ ఏమైనా చేస్తారు. అన్ని పథకాలను హుజురాబాద్ నుంచే ఎందుకు అమలు చేస్తోందని ఇందిరా శోభన్ నిలదీశారు.

హుజూరాబాద్‌లో పాదయాత్ర ద్వారా రాజకీయంగా సత్తా చూపించాలని ఇందిరా శోభన్‌ వావిస్తున్నారని అనుకోవచ్చు. దానికి వచ్చే స్పందన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ప్లాన్‌ చేస్తారు. హుజూరాబాద్‌ ఎన్నికల తరువాతే ఆమె ఏ పార్టీ చేరాలో నిర్ణయించుకుంటారని ఆమె మద్దతుదారులు అంటున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాల తరువాత 2023 ఎన్నికలపై కొంత క్లారిటీ వస్తుంది. అలాగే కాంగ్రెస్ రేవంత్‌ ప్రభావం ఎలా ఉంది అన్నదానిపై కూడా క్లారిటీ వస్తుంది. అందుకే తొందరపడి అప్పుడే ఏపార్టీలో చేరకూడదని ఇందిర భావించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు!!

Exit mobile version