TS Inter Results 2023: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాసేపటి క్రితమే విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను వెల్లడించారు. రెండింటిలోనూ బాలికలే సత్తా చాటారు. ఫలితాల కోసం ntvtelugu.com వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించవచ్చు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4 లక్షల 33 వేల 82 మంది హాజరుకాగా వీరిలో 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఫస్ట్ ఇయర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరందరిలో 1,60,000 మంది A గ్రేడ్‌లో పాస్‌కాగా.. 68,335 మంది B గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించారు.
ఇక, అమ్మాయిలు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. అబ్బాయిలు 56.82 శాతం మంది పాస్ అయ్యారు. ఇది ఇలా ఉంటే.. సెకండ్ ఇయర్ లో.. మొత్తం 3,80,920 మంది హాజరుకాగా 2,56,241 మంది పాస్ అయ్యారు. కాగా.. సెకండ్ ఇయర్‌లో మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో లక్ష 73వేల మంది A గ్రేడ్‌లో పాస్ కాగా, 54,786 మంది B గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించగా.. అమ్మాయిలు 73.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక అబ్బాయిలుల 60.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే ఒకేషనల్ కోర్సుల విషయానికొస్తే ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 2,55,533 మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో 28738 మంది పాస్ అయ్యారు.
ఈరోజు 2022-23 ఫలితాలను విడుదల చేసామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించామని, విద్యార్థి దశలో ఇంటర్ కీలకమన్నారు. జీవితానికి టర్నింగ్ పాయింట్ అని తెలిపారు. మన రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ పరీక్షలకు 9,45,153 మంది హాజరయ్యారని తెలిపారు. 1473 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. 26 వేల మంది సేవలందించారని తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అన్ని శాఖలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విషయంలో ఇంటర్ వెయిటేజీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలెవరూ ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.