NTV Telugu Site icon

Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు కూడా వర్షాలు పడతాయి

Rain Alert

Rain Alert

Telangana Rains: తెలంగాణ రాష్ట్రంపై మిచాంగ్ తుపాన్ ప్రభావం కనిపిస్తోంది. ఏపీలోని బాపట్లలో తీరం దాటిన తుపాను ఉత్తర దిశగా కదులుతున్న సమయంలో బలహీనపడింది. బుధవారం మధ్యాహ్నానికి కోస్తా, దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా అల్పపీడనంగా మారి తెలంగాణ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది చత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లి పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కూడా ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం కుమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 22.1 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, కొత్తగూడెం జిల్లా మద్దుకూరులో అత్యధిక వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌లో చలి గాలుల తీవ్రత పెరిగింది. తుపాన్ ప్రభావంతో మూడు రోజులుగా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం రాజేంద్రనగర్‌లో 18.5 డిగ్రీలు, హయత్‌నగర్‌లో 18.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలో సాధారణం కంటే 6-7 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఒక్కసారిగా చలి పెరిగింది. తెల్లవారుజామున మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Read also: CM Jagan: ఇంద్రకీలాద్రిలో సీఎం జగన్.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన

మరోవైపు రాష్ట్రంలో మైచౌంగ్ తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసి 4.72 లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురైన అన్నదాతలకు భారీ నష్టం వాటిల్లింది. వరి కుప్పలు నేలకొరిగాయి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి, మినుము, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయల పంటలు నాశనమయ్యాయి. చాలా ప్రాంతాల్లో పొలాల్లో ధాన్యంతో పాటు కోతకు వచ్చిన వరి తడిగా ఉంది. కొన్ని చోట్ల ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షం వల్ల కష్టాలన్నీ నేలకూలాయని రైతులు వాపోతున్నారు. రైతులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తుపాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో బుధవారం 14 రైళ్లను రద్దు చేశారు. వీటిలో చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603) మరియు రాయపల్లె-సికింద్రాబాద్ (17646) ఉన్నాయి. హైదరాబాద్-చెన్నై సెంట్రల్ (12604) ఎక్స్‌ప్రెస్‌ను గురువారం రద్దు చేశారు. మరోవైపు, పరిపాలనా కారణాలతో ఆదిలాబాద్-హెచ్‌ఎస్ నాందేడ్ (17409) రైలు గురువారం రద్దు చేయబడింది.
Bigg Boss 7 Telugu: తారుమారైన ఓటింగ్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?

Show comments