iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!

  • బ్యాంక్ ఖాతాల వినియోగానికి నాంపల్లి కోర్టు అనుమతి
  • రూ.3 కోట్ల అన్‌ఫ్రీజ్‌కు న్యాయస్థానం నిరాకరణ
  • కుటుంబ పోషణకు ఇబ్బందులంటూ రవి పిటిషన్
  • దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక ఆదేశాలు
Ibomma

Ibomma

iBomma Ravi : పైరసీ సైట్ ఐబొమ్మ (iBomma) వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న రవికి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట లభించింది. గతంలో పోలీసులు సీజ్ చేసిన తన బ్యాంక్ ఖాతాలను రోజువారీ ఆర్థిక లావాదేవీల కోసం తిరిగి ఉపయోగించుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే, అదే సమయంలో ఆయా ఖాతాల్లో ప్రస్తుతం ఫ్రీజ్ అయి ఉన్న రూ. 3 కోట్ల నగదును మాత్రం అన్‌ఫ్రీజ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది.

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని పిటిషన్

పోలీసుల దర్యాప్తులో భాగంగా తన బ్యాంక్ ఖాతాలు పూర్తిగా స్తంభించిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఖాతాలన్నీ ఫ్రీజ్ కావడం వల్ల దైనందిన జీవితం గడవడం కష్టంగా మారిందని, తన కుటుంబ పోషణ కూడా భారమైందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల సీజ్ అయిన తన బ్యాంక్ ఖాతాల్లోని రూ. 3 కోట్ల నగదును వెంటనే విడుదల చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

ఖాతాల వాడకానికే గ్రీన్ సిగ్నల్.. ఫ్రీజ్ అయిన నగదుపై నో

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి న్యాయస్థానం ఇరువైపులా వాదనలను విన్న అనంతరం పాక్షికంగా ఆదేశాలు జారీ చేసింది. సదరు బ్యాంక్ ఖాతాలను నిత్య లావాదేవీల కోసం మాత్రమే ఉపయోగించుకోవడానికి అనుమతిని ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, దర్యాప్తు సంస్థల ద్వారా ఫ్రీజ్ అయిన రూ. 3 కోట్ల మొత్తాన్ని మాత్రం ప్రస్తుతం రిలీజ్ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. దాంతో రవికి బ్యాంక్ ఖాతాల వినియోగానికి మాత్రమే అవకాశం దక్కినట్లయింది.