Site icon NTV Telugu

IBomma Ravi : ఐబొమ్మ కేసులో సంచలనం.. ఇమంది రవి ‘గుర్తింపు’ దొంగతనం..

Ibomma Ravi

Ibomma Ravi

IBomma Ravi : పైరసీ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసుల కస్టడీలో ఉన్న రవిని విచారిస్తున్న కొద్దీ దిస్తున షాకింగ్ విషయాలు దర్యాప్తు అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా రవి ఒక అమాయకుడి డాక్యుమెంట్లను దొంగలించి, వాటితో తన అక్రమ సామ్రాజ్యాన్ని నడిపినట్లు తేలింది.

గతంలో పోలీసుల విచారణలో ఇమంది రవి మాట్లాడుతూ.. ‘ప్రహ్లాద్ వెల్లేల’ అనే వ్యక్తి తన రూమ్‌మేట్ అని, అతని సహకారం కూడా ఉందని పేర్కొన్నాడు. అయితే పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ప్రహ్లాద్‌కు తెలియకుండానే అతని పాన్ కార్డ్ (PAN Card), డ్రైవింగ్ లైసెన్స్‌ వంటి కీలక పత్రాలను రవి దొంగలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దొంగలించిన డాక్యుమెంట్ల ఆధారంగానే రవి ప్రహ్లాద్ పేరుతో కొత్త గుర్తింపు కార్డులు సృష్టించి, బ్యాంక్ ఖాతాలు లేదా వెబ్‌సైట్ లావాదేవీల కోసం వాడినట్లు తెలుస్తోంది.

నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు పోలీసులు బెంగళూరులో ఉంటున్న ప్రహ్లాద్‌ను ప్రత్యేకంగా పిలిపించారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్‌ను కూర్చోబెట్టి పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.

ప్రహ్లాద్ స్టేట్‌మెంట్ విచారణలో ప్రహ్లాద్ పోలీసులకు స్పష్టమైన వివరణ ఇచ్చారు. అసలు ఇమంది రవి ఎవరో తనకు తెలియదని, తామిద్దరం ఎప్పుడూ రూమ్‌మేట్స్ కాదని ప్రహ్లాద్ తేల్చి చెప్పారు. తన పేరుతో రవి పాన్ కార్డు, లైసెన్స్ తీసుకున్నాడని తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన వాపోయారు. ఇమంది రవి తన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడ్డాడని ప్రహ్లాద్ ఫిర్యాదు చేశారు.

దీంతో ఇమంది రవి కేవలం పైరసీకే పరిమితం కాకుండా, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి (Identity Theft) మోసాలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఈ కేసులో ఇంకా ఎంతమంది డాక్యుమెంట్లు ఇలా దుర్వినియోగం అయ్యాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Exit mobile version