హైదరాబాద్ నగరంలో నీటి వ్యాపారం ముసుగులో సాగుతున్న అక్రమ బోర్ల మాఫియా గుట్టు రట్టయింది. మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువు పరిసర ప్రాంతాలు అక్రమ నీటి దందాకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ‘హైడ్రా’ (HYDRAA) కొరడా ఝళిపించింది. రెవెన్యూ , సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చెరువు చుట్టూ ఇష్టారాజ్యంగా తవ్విన అక్రమ బోర్లను గుర్తించి, వాటిని తొలగించే చర్యలు ప్రారంభించారు.
చెరువు పరిసరాల్లో ఏళ్ల తరబడి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బోర్లు వేసి భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా తోడిన లక్షలాది లీటర్ల నీటిని వందల సంఖ్యలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నగరంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. హాస్టళ్లు, హోటళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు , నిర్మాణంలో ఉన్న భారీ అపార్ట్మెంట్లకు ఈ నీటిని భారీ ధరలకు విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది.
నగరంలో నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ దందా కారణంగా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు ప్రమాదకరంగా పడిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ వందల అడుగుల లోతుకు వెళ్లినట్లు చెబుతున్నారు. విశేషమేమిటంటే, ఈ అక్రమ దందా బయటపడకుండా అక్రమార్కులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. బయటకు సాధారణ నివాస గృహాల్లా కనిపిస్తున్న ఇళ్లలో, కొన్ని చోట్ల ఏకంగా బెడ్రూమ్లలోనే బోర్లు వేసి రహస్యంగా నీటిని తోడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి రావడం విస్మయానికి గురిచేసింది.
భూగర్భ జలాలను కాపాడటం, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా రంగంలోకి దిగిన హైడ్రా.. ఈ అక్రమ నీటి దందాకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. కేవలం బోర్లను తొలగించడంతో సరిపెట్టకుండా, నిబంధనలను ఉల్లంఘించి నీటి వ్యాపారం సాగిస్తున్న ప్రధాన నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. బాధ్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసే ప్రక్రియను కూడా అధికారులు వేగవంతం చేశారు. చెరువుల చుట్టూ సాగే ఇలాంటి అక్రమాలకు హైడ్రా చర్యలతోనైనా పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందాని నగరవాసులు ఆశిస్తున్నారు.

