NTV Telugu Site icon

Hyderabad Rains: రోడ్లను ముంచిన వరద.. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీళ్లు..

Hyderabad Rains

Hyderabad Rains

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. శనివారం సాయంత్రం గంటకు పైగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు మోకాలి లోతులో నీళ్లు నిలిచి చెరువులను తలపించాయి. వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. మురికివాడలు, కాలనీల్లోనే కాదు ఇళ్లలోకి వరద పోటెత్తింది. ఖైరతాబాద్‌లోని ఎంస్‌మక్తా, బేగంపేట బ్రాహ్మణివాడి, లంగర్‌హౌస్‌, యూసుఫాగూడ శ్రీకృష్ణానగర్‌ బి-బ్లాక్‌, లక్ష్మీనర్సింహనగర్‌ ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వాసులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రాత్రి 9 గంటల వరకు లంగర్‌హౌస్‌లో 9.1 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ స్టాటిస్టిక్ భవన్‌లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోవడంతో జీహెచ్‌ఎంసీ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని తొలగించారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యతో ఎక్కువ మంది మెట్రోను ఆశ్రయించారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్, సికింద్రాబాద్‌లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి పడుకునే సమయంలో వర్షం కురవడంతో పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు పూర్తిగా తడిసి ముద్దయ్యారు.
CLP Meeting: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..