NTV Telugu Site icon

2BHK Houses: నేడే డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ.. ఎవరెవరు ఎక్కడంటే..

2bhk Houses

2bhk Houses

2BHK Houses: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి మరోసారి సమయం ఆసన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు రెండు దశల్లో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. తాజాగా మూడో దశలో రెండు దశల్లో 36 వేల ఇళ్లను ప్రభుత్వం అందించనుంది. తొలిదశలో ఇవాళ (సోమవారం) 19,020 మందికి ఇళ్ల పట్టాలు, ఈ నెల 5న మరో 17,864 మందికి డిగ్నిటీ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటిని పూర్తిగా ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి పేదలకు దశలవారీగా పంపిణీ చేస్తోంది. రూ.9,600 కోట్లతో జీహెచ్‌ఎంసీ ప్రధానమైన ప్రాంతాల్లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. నిర్మించిన ఇళ్లను చాలా పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకతీతంగా ర్యాండమైజేషన్ విధానంలో పంపిణీ చేస్తున్నారు. మొదటి విడుతలో 11,700 మందికి, రెండో విడుతలో 13,200 మందికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇళ్లు మంజూరు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఇక మూడో విడుతలో 36,884 మందిని ఎంపిక చేశామని, సోమవారం 19,020 మందికి, మిగిలిన వారికి 5న ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Read also: Astrology: అక్టోబర్‌ 2, సోమవారం దినఫలాలు

ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, ర్యాండమైజేషన్‌ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తామన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా కుత్బుల్లాపూర్, చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్చెరు, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, తలసాని, మహమూద్‌ అలీ, పట్నం మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పేదలకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. నగరంలో ఇప్పటి వరకు మొదటి దశలో 11,700 మందికి, రెండో దశలో 13,200 మందికి ఇళ్లను విజయవంతంగా పంపిణీ చేశారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?