Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. అత్యవసరమైతేనే బయటకు రండి..!
- తెలంగాణలో భారీ వర్షాల బీభత్సం..
- పాఠశాలలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్లు..
- వాగులు పొంగిపొర్లి రాకపోకలకు అంతరాయం..
- తెలంగాణలో రెడ్ అలర్ట్ పరిస్థితులు..
- ప్రా జెక్టులకు భారీ వరద, ప్రజలకు హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Heavy Rains: తెలంగాణలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోవడంతో పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపకుండా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అలాగే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ హరిత సెలవు ప్రకటించారు.
Also Read
ములుగు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మేడారం జంపన్న వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. జంపన్న వాగులో స్నానానికి దిగిన గట్కేసర్‌కు చెందిన తిమ్మయ్య అనే భక్తుడు గల్లంతయ్యాడు. ఏటూరునాగారం మండలంలోని కొండాయి, మల్యాల, గోవిందరాజులు కాలనీ, ఐలాపూర్, ఎలిశెట్టి పల్లి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కన్నాయిగూడెంలో అత్యధిక వర్షపాతం నమోదవగా, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముప్పనపల్లి, బుట్టాయిగూడెం లక్ష్మీపురం, తుపాకులగూడెం గ్రామాల్లో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లాలో నిన్న ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయికల్ మండలం ఐలాపూర్‌లో 9.6 సెంటీమీటర్లు, బీర్పూర్లో 9.0 సెంటీమీటర్లు, సిరికొండలో 8.33, వెల్గటూర్‌లో 8.20, ఎండపల్లిలో 7.81, జిల్లా కేంద్రంలో 7.74, ధర్మపురిలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాని మండలం దుగ్గపూర్ వద్ద లో-లెవెల్ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూర్ మండలంలో సుశ్మీర్ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో 12 గ్రామాలకు రవాణా నిలిచింది. సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట వద్ద మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో పెన్‌గంగా నది వరద ఉద్ధృతి పెరుగుతోంది.
కరీంనగర్ జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 46,410 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 12,642 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 11 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం నంది పంప్‌హౌస్ ద్వారా నాలుగు మోటార్లతో గాయత్రి పంప్‌హౌస్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి బాహుబలి మోటార్ల ద్వారా మధ్య మానేరు జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. మధ్య మానేరు ప్రాజెక్టుకు 12,840 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, 27 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌లో ప్రస్తుతం 8.2 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్-2, 3 గనుల్లో రోజుకు సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో బోరాజ్ మండలం తర్నం వద్ద వాగు పొంగిపొర్లడంతో ఆదిలాబాద్-మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించగా, ఎవరూ వాగు దాటకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మల్లారం ఫీడర్ ఛానల్‌పై వరద నీరు ప్రవహిస్తుండటంతో మధ్య మానేరు రిజర్వాయర్ క్రమంగా నిండుతోంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఈ వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దోమకొండ ఎడ్లకట్ట వాగు, నిజాంసాగర్ నల్లవాగు, షేర్ఖాన్పల్లి వాగు, లింగంపేట పెద్దవాగు పొంగిపొర్లుతున్నాయి. కళ్యాణి రిజర్వాయర్‌లో వరద ప్రభావంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 375 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం ఉండాల్సి ఉండగా, ఇప్పటికే 401 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐదు మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.
నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు గంట గంటకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. క్యాచ్మెంట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి మరింత వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు నది ఒడ్డుకు, పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.
నిజామాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మెండోరా మండలంలో అత్యధికంగా 115.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిరికొండ మండలం కొండూరు వాగు వద్ద వరద ప్రభావంతో తాత్కాలిక మట్టి రహదారి కోతకు గురైంది. చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండిపోతుండటంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. అత్యవసరమైతేనే బయటకు రండి..!
-
MLA Jagan: ‘బెంగళూరును ఏలుతున్నాం’ వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్‌పై కన్నడ సంఘాల ఆగ్రహం
-
Sai Pallavi: సహజ నటన, అభినయం.. సీతమ్మ పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి!
-
Colorful RimBook L1 Plus: AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్‌తో.. కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్‌టాప్ విడుదల
-
Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!