Site icon NTV Telugu

Telangana Bonalu: తెలంగాణ సంస్కృతిలో బోనాల స్థానం – 600 ఏళ్ల ప్రస్థానం

Bonalu

Bonalu

Telangana Bonalu: తెలంగాణ సంస్కృతికి ప్రతీక, అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఆషాడ మాస బోనాలు ఈరోజు (జూన్ 26) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బోనాలు జులై 24వ తేదీతో ముగుస్తాయి. ఇక, అమ్మల గన్న అమ్మ, ఆది పరాశక్తికి బోనం నైవేథ్యం సమర్పణను తెలంగాణలో ఓ పండుగలా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా పలు రకాల పూజలు చేస్తారు. . డిల్లెం పల్లెం చప్పుళ్లతో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో పాటు పసుపు బండారులు, వేపల సువాసనల నడుమ కల్లు సాకలతో ఆ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాల ఊరేగింపు సమయంలో నువ్వు పెద్దపులి ఎక్కినావమ్మో అంటూ అందరూ కలిసి ఆడుతూ పాడుతూ చేసే ఆ వేడుకే తెలంగాణ బోనాల జాతరకు ప్రత్యేక ఆకర్షణీయం. దశాబ్దాల చరిత్ర కలిగిన బోనాల జాతర తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైంది.

Read Also: Aashadam Bonalu 2025 : గోల్కొండపై తొలి బోనం.. ఆషాఢ బోనాలకు భక్తి శోభా ఆరంభం!

అయితే, ఈరోజు ఆషాడ మాసం తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారికి భక్తులు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ అర్చకులు జగజ్జనని అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో బోనాల పండగ సందడి స్టార్ట్ అవుతుంది. ఇక, జులై 13వ తేదీన సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో బోనాలు తీయనున్నారు. వీటినే లష్కర్‌ బోనాలు అని పిలుస్తారు. జులై 21వ తేదీన లాల్‌దర్వాజ ఆలయంలో జరిగే రంగం వేడుకలతో హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ముగుస్తాయి.

Read Also: Akhanda Godavari Project: నేడు ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్‌కు శంఖుస్థాపన!

ఇక, తెలంగాణలో బోనాల పండగ ఉత్సవాలకు ఎంతో చరిత్ర కలిగి ఉంది. 600 ఏళ్ల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు ఏడుకోళ్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలను సమర్పించుకున్నారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అలాగే, 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్ లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారని నానుడి. ఇక, గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే బోనాలు పండగ జరుగుతుందని.. ఆ తర్వాత గోల్కొండను జయించిన కులీ కుతుబ్ షా, బాదూషా సైతం ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని చరిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తానీషా పాలనలో అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలోనే ఘనంగా గోల్కొండ కోట మొదలు హైదరాబాద్‌లోని అమ్మవార్లు, గ్రామ దేవతల ఆలయాల్లో బోనాల పండగ సంబరాలు వైభవంగా సాగేవని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. కాగా, బోనాల ఉత్సవాలను కల్లారా చూసి ఆనందంతో పరవశిస్తుంటారు భక్తులు. ఈ జాతర నెల రోజులు తెలంగాణ పుర వీధులు కళకళలాడుతుంటాయి. రాష్ట్రంలోని ప్రతి గడప పచ్చని వేపాకులతో పసుపు గడపలతో ఇంటి ఆడపడులు, పిల్లా పాపలతో కళకళలాడుతు దర్శనమిస్తాయి.

Exit mobile version