Site icon NTV Telugu

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఇంకా ఏం మిగిలింది..?

Phone Tapping

Phone Tapping

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌పై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేసిన ధర్మాసనం.. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు? ఈ కేసులో ఇంకా ఏం మిగిలింది? అంటూ దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్‌ను పూర్తిచేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. మీ పర్పస్ పూర్తయిందా? లేదా? మళ్లీ ఆయన్ని జైల్లో పెట్టాలనుకుంటున్నారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ప్రభాకర్‌రావును పిలవకుండా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరమైతే మళ్లీ పిలిచి విచారణ చేయవచ్చని, ప్రభాకర్‌రావు దర్యాప్తుకు సహకరిస్తారని కోర్టు వ్యాఖ్యానించింది.

Read Also: BJP National President: కమలం పార్టీలో నడ్డా శకం ముగిసింది.. బీజేపీకి నయా సారథి ఇతడే!

ఇక, కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్‌ 142 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్‌రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా లేదా అనేదే ప్రధాన ప్రశ్నగా లూథ్రా పేర్కొన్నారు. అలాగే, కస్టడీలో ఉన్న వ్యక్తికి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దర్యాప్తు వేగం, కస్టడీ అవసరం, ముందస్తు బెయిల్ అంశాలపై కోర్టు స్పష్టత ఇవ్వడం ఈ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు.

Exit mobile version