సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో రూ.100, రూ.500 ఇస్తే కండక్టర్ టిక్కెట్ డబ్బులు పోను చిల్లర తర్వాత ఇస్తానని టిక్కెట్ మీద రాసిస్తుంటాడు. కానీ కొంతమంది బస్సు దిగే హడావిడిలో చిల్లర సంగతి మరిచిపోతుంటారు. హైదరాబాద్ నగరంలో ఓ విద్యార్థి కూడా ఇలాగే చిల్లర తీసుకోవడం మరిచిపోయాడు. అయితే ఓ ట్వీట్ ద్వారా ఆ డబ్బులను వెనక్కి పొందడం విశేషం. వివరాల్లోకి వెళ్తే… ఈనెల 4వ తేదీ గురువారం నాడు సీతాఫల్‌మండికి చెందిన బాలరాజు అనే విద్యార్థి బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. రూ.20 టిక్కెట్ కోసం రూ.100 నోటును కండక్టర్‌కు ఇచ్చాడు. తన దగ్గర చిల్లర లేకపోవడంతో బస్సు దిగేటప్పుడు అడిగి తీసుకోవాలని చెప్తూ.. టిక్కెట్ వెనుక రూ.80 అని కండక్టర్ రాసిచ్చాడు.
Read Also: మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
అయితే తన గమ్యస్థానం రాగానే బాలరాజు చిల్లర తీసుకోకుండానే బస్సు దిగేశాడు. అనంతరం అతడికి చిల్లర విషయం గుర్తుకురావడంతో తుది ప్రయత్నంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ తన బాధను ట్వీట్ ద్వారా వెల్లడించాడు. విద్యార్థి ట్వీట్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించి జీడిమెట్ల డిపో మేనేజర్‌తో మాట్లాడారు. దీంతో సదరు విద్యార్థికి చెల్లించాల్సిన రూ.80 నగదును శనివారం ఫోన్ పే చేసినట్లు జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. కాగా ఈ సమస్యపై వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ, డిపో మేనేజర్‌లపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.