NTV Telugu Site icon

Hyderabad: అల్వాల్లో క్యాటరింగ్ వ్యాపారి హత్య.. నిందితుడి అరెస్ట్..!

Crime

Crime

హైదరాబాద్ నగరంలోని అల్వాల్ లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇంట్లో పని చేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకెళ్లేందుకు వేసిన పథకంలో భాగంగా యజమానిని హత్య చేసినట్లు పేట్ బషీర్ బాద్ ఏసీపీ రాములు తెలిపారు. క్యాటరింగ్ వ్యాపారి అన్వర్ ను హత్య చేసిన నిందితుడు మనోజ్ రాయల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. కానాజీగూడ ఇందిర నగర్ కు చెందిన క్యాటరింగ్ వ్యాపారి అన్వర్ ఇంట్లో పని చేసే మనోజ్ రాయల్ అనే వ్యక్తి.. చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందుల కారణంగా హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు వారు చెప్పుకొచ్చారు.

Read Also: Jammu Kashmir: భద్రతా బలగాల కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

ఇక, ఉత్తరాఖండ్ కు చెందిన మనోజ్ రాయల్ అన్వర్ దగ్గర పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన యజమానికి ఉన్న సంపదను కొట్టేయాలని ప్లాన్ చేసి.. పథకం ప్రకారం హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నెల 13 న అన్వర్ బంధువులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ కు వెళ్ళగా.. అన్వర్ తిరిగి ఆల్వాలోని ఇంటికి త్వరగా వచ్చినట్లు పేర్కొన్నారు. అన్వర్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా తీసుకొని అతడికి అతిగా మద్యం తాగించిన మనోజ్.. గోడకు అన్వర్ తలను బలంగా గుద్ది హతమార్చాడు.. అన్వర్ మరణించాడని ధృవీకరించుకున్న తర్వాత వెంటనే ఏటీఎం కార్డు, నగదు, బంగారం, ద్విచక్రవాహం తీసుకుని పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, ఏటీఎం కార్డుతో పాటు అన్వర్ ఫోన్ ఉపయోగించి రెండు లక్షల వరకు డబ్బు డ్రా చేసినట్లు గుర్తించారు. ఏటీఎం సీసీ కెమెరాలలో నగదు తీసుకెళుతున్నట్లు గుర్తించి మనోజ్ ను పోలీసులు పట్టుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పేట్ బషీర్ బాద్ ఏసీపీ రాములు పేర్కొన్నాడు.