Site icon NTV Telugu

Blast : పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు.. 5గురు మృతి

Blast

Blast

Blast : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. దీంతో కార్మికులు పనిలో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటం, పేలుడుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి.

పేలుడు ధాటికి పరిశ్రమ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు ఎగిరిపడ్డాయని ప్రత్యక్షదారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు మృతి చెందగా, ఇంకా 20 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Star Wars : ఆ ఇద్దరి స్టార్స్ మధ్య మరోసారి నువ్వా నేనా.?

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. తీవ్ర గాయాలపాలైనవారిని అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు.

పేలుడు సమయంలో పరిశ్రమలో ఉన్న పలువురు కార్మికులు బయటకు పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే పేలుడు శబ్దం దూరం వరకు వినిపించడంతో పరిసర ప్రాంతాల్లోని స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు, సహచర కార్మికులు చేరుతున్నారు.

ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా, గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలో ఇంకా మంటలు కొనసాగుతుండటంతో రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికి స్పష్టంగా తెలియకపోయినా, రియాక్టర్ లో ఏదైనా సాంకేతిక లోపం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పరిశ్రమలో రక్షణ నిబంధనలు పాటించారా లేదా అన్న దానిపై అధికారుల దృష్టి వెళుతోంది.

Regina Cassandra : సొగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న రెజీనా కాసాండ్రా

Exit mobile version