ICICI Bank Loan Fraud: ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు నకిలీ శాలరీ స్లిప్స్ సృష్టించి, ఏకంగా బ్యాంకు నుంచి రూ.30 లక్షల రూపాయల రుణం కొట్టేసిన ముఠాను ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన ఈ మోసపూరిత వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. నిందితులు ఐదుగురు ఏజెంట్లతో కలిసి పక్కా ప్లాన్ తో ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగ నియామక పత్రాలు, జీతపు స్లిప్పులు నకిలీవి సృష్టించారు. అంతేకాదు, నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు కూడా తయారు చేసి బ్యాంకుకు సమర్పించినట్లు విచారణలో తేలింది.
నిజానికి నిందితులకు ఎలాంటి ఉద్యోగం లేదని, బ్యాంక్ అకౌంట్ కూడా లేదని పోలీసులు గుర్తించారు. అయినా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ లక్షల్లో జీతం తీసుకుంటున్నట్లు ఫేక్ డాక్యుమెంట్లు చూపించి ICICI బ్యాంకు నుంచి రూ.30 లక్షల రుణం పొందినట్లు పోలీసులు చెబుతున్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు.
ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం బ్యాంక్ అధికారుల పాత్ర. ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా, ఎలాంటి పత్రాలు సరిగా లేకుండానే రూ.30 లక్షల రుణాన్ని ఎలా శాంక్షన్ చేశారన్న దానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. బ్యాంక్ అధికారులకు ఈ ముఠాతో సంబంధం ఉందా, నిర్లక్ష్యంతో లోన్ ఇచ్చారా, లేక కుమ్మక్కయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా ఇంకా ఎన్ని బ్యాంకులను ఇదే తరహాలో మోసగించింది, ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనే కోణంలోనూ విచారణ కొనసాగుతోందని ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.

