Nepal Floods: నేపాల్‌లో వరదలకు సంబంధించిన దృశ్యాలు చూస్తేనే షాక్ అయ్యే పరిస్థితి.. భారీ ఆస్తినష్టంతో పాటు.. పెద్ద ఎత్తున ప్రాణనష్టం కూడా జరిగింది.. ఇక ఎంతో మంది గల్లంతు అయ్యారు.. అయితే, నేపాల్‌లో భారీ వరదల కారణంగా చిక్కుకుపోయిన లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తెలంగాణకు చెందిన యాత్రికులు, పర్యాటకులు, ఇతర వ్యక్తులకు అవసరమైన సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌తో పాటు సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేపాల్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు లేదా పరిచయస్తులతో సంప్రదింపులు జరపలేకపోతున్న తెలంగాణ వాసులు ఈ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. ముఖ్యంగా నేపాల్‌లో పర్యటిస్తున్న వారు, యాత్రలకు వెళ్లిన వారు లేదా ఇతర కారణాలతో అక్కడ ఉన్నవారి కుటుంబ సభ్యులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
ఈ వివరాలు తప్పనిసరిగా అందించాలి
సహాయక చర్యలను వేగంగా సమన్వయం చేసేందుకు హెల్ప్‌లైన్ అధికారులకు బాధితుల వివరాలను అందించాలని ప్రభుత్వం సూచించింది. సంబంధిత వ్యక్తి పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో ప్రస్తుతం ఉన్న ప్రాంతం లేదా చివరిగా తెలిసిన ప్రదేశం, ట్రావెల్/టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్ నంబర్లు
శ్రీమతి వందన – పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్
📞 9871999044
శ్రీ సి.హెచ్. చక్రవర్తి – పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
📞 9949351270
శ్రీ జి. రక్షిత్ నాయక్ – లైజన్ ఆఫీసర్
📞 9618597969
MEA, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం
హెల్ప్‌లైన్‌కు అందే విజ్ఞప్తులను అధికారులు ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిశీలించనున్నారు. అవసరమైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి సహాయక చర్యలను సమన్వయం చేయనున్నారు. నేపాల్‌లో వరదల పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందేలా కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో కలిసి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Government of Telangana Activates Helpline for Assistance to Telangana Residents Affected by Nepal Floods
In view of the prevailing flood situation in Nepal, the Government of Telangana, *on the instructions of Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, has activated a…
— IPRDepartment (@IPRTelangana) August 26, 2026

