Minister Uttam Kumar Reddy: రాష్ట్రంలో కరువు ఉపశమన చర్యలు, భూగర్భజలాల సంరక్షణ, పునరుద్ధరణ పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. కరువు ఉపశమన చర్యలతో పాటు భూగర్భజలాల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, నీటిపారుదల శాఖలు సమన్వయంతో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. భూగర్భజలాల పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న జల సంరక్షణ చర్యలను అధ్యయనం చేసి, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
భూగర్భజలాల పరిరక్షణకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయిస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవసరమైతే ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్‌కు మించి కూడా అదనపు నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భూగర్భజల శాఖ పనితీరు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల భూగర్భజల శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, జిల్లాలవారీగా భూగర్భజలాల స్థితిగతులను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. భూగర్భజల మట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోతున్నాయన్న వార్తలను తీవ్రంగా పరిగణించాలని, ప్రస్తుతం చేపడుతున్న సంరక్షణ పనులు, భవిష్యత్తులో అవసరమయ్యే చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విజయవంతమైన జల సంరక్షణ కార్యక్రమాలను తెలంగాణలోనూ అనుసరించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి తెలిపారు. ముఖ్యంగా రాజస్థాన్‌లో చేపట్టిన భూగర్భజల పునరుద్ధరణ చర్యలను అధ్యయనం చేయాలని, మహారాష్ట్రలో అమలవుతున్న జల సంరక్షణ కార్యక్రమాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఆయా రాష్ట్రాల అనుభవాలను ఉపయోగించుకుని తెలంగాణలో భూగర్భజల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఇక, ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ రమేష్‌బాబు, నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ దివ్య, భూగర్భజల శాఖ డైరెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

