Terrorist Arrest: రాజేంద్రనగర్‌కు చెందిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. భారీ స్థాయిలో విష ప్రయోగం చేసి అమాయక ప్రజలను చంపాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. అయితే, సయ్యద్ మొయినుద్దీన్ అత్యంత ప్రమాదకరమైన ‘రెసిన్’ విషాన్ని తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. దేవాలయాలు, వాటర్ ట్యాంకులలో ఈ విషాన్ని కలిపేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాది మొయినుద్దీన్ వద్ద నుంచి రెసిన్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, పరికరాలను గుజరాత్ ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది.
Read Also: Amit Shah: కాసేపట్లో అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం
ఇక, పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద హ్యాండ్లర్ ఆదేశాల మేరకే ఉగ్రవాది మొయినుద్దీన్ ఈ రెసిన్ విషాన్ని తయారు చేస్తున్నట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ధృవీకరించారు. ఇతను నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ – ఖొరాసన్ ప్రావిన్స్’ కు చెందిన హ్యాండ్లర్ అబు ఖాదిమ్‌తో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే, డాక్టర్ మొయినుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. అనంతరం ఆన్‌లైన్ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ, ఒకవైపు టెర్రరిస్టు కార్యకలాపాల్లో భాగం అయ్యాడు. ఉగ్రవాద దాడుల కోసం నిధులు సేకరించడం, కొత్త వారిని రిక్రూట్ చేసుకునే ప్లాన్‌లో కూడా ఇతడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కుట్రకు సంబంధించి డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్‌తో పాటు మరో నలుగురిని కూడా గుజరాత్ ఏటీఎస్ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.