Ramreddy Damodhar Reddy Passes Away: మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 4వ తేదీన తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ హయాంలో ఐటీశాఖ మంత్రిగా పనిచేశారు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి..
Read Also: Kantara Chapter 1 Review: కాంతార చాప్టర్ 1 రివ్యూ
ఖమ్మం జిల్లా పాతలింగాల గ్రామానికి చెందిన రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలమ్మ దంపతులకు 1952 సెప్టెంబరు 14న దామోదర్‌రెడ్డి జన్మించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామసాగర్ జలాలను తరలించేందుకు విశేష కృషి చేశారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు ఐదుసార్లు పోటీ చేయగా.. నాలుగుసార్లు గెలుపొందారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. 1988, 1989లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి… టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2004లో విజయఢంకా మోగించారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2009లో గెలుపొంది.. వై.ఎస్ కేబినెట్ లో ఐటీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014, 2018, 2023 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. దామోదర్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దామోదర్‌రెడ్డి మృతిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
