Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్‌వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!

Eagle Force

Eagle Force

Eagle Force: రాష్ట్రంలో నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్ల (ఈ-సిగరెట్లు/వేప్స్) అక్రమ విక్రయం, సరఫరాపై స్టేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. కోల్‌కతా, హైదరాబాద్, కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న అంతర్-జిల్లాల, అంతర్రాష్ట్ర వేప్స్ సరఫరా నెట్‌వర్క్‌ను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి మొత్తం 31 ఈ-సిగరెట్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నవంబర్ 12, 2026న కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘బిస్మిల్లా హోటల్ & కేఫ్’పై కరీంనగర్ ఆర్‌ఎన్‌సీసీ (RNCC), ఈగల్ ఫోర్స్ బృందాలు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించాయి. అక్కడ మైనర్లకు నిషేధిత ఈ-సిగరెట్లను విక్రయిస్తున్న మహ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 12 ఈ-సిగరెట్లు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో.. తనకు మొదట అయాన్ అనే వ్యక్తి నుంచి, ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఒమర్ అనే వ్యక్తి నుంచి కొరియర్ ద్వారా వేప్స్ అందుతున్నాయని ఆసిఫ్ వెల్లడించాడు. ఈ సమాచారంతో పోలీసులు తీగ లాగగా డొంకంతా కదిలింది. కరీంనగర్ నిందితుడు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ బృందం.. నవంబర్ 14, 2026న హైదరాబాద్ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాహిల్ ఖాన్ అలియాస్ ఒమర్ (26)ను అదుపులోకి తీసుకుంది. నిషేధిత వేప్స్‌ను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన 19 ఈ-సిగరెట్లు, ఒక మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. మీర్‌చౌక్ పీఎస్‌లో Cr.No.279/2026 కింద కేసు నమోదు చేశారు.

చార్మినార్ మక్కా మసీదు ఎదురుగా ఫుట్‌పాత్‌పై బట్టలు అమ్ముకునే రాహిల్ ఖాన్ నెలకు రూ.15 వేలు సంపాదించేవాడు. రెండేళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందుల వల్ల జొమాటో, పోర్టర్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో ఈ-సిగరెట్లు అమ్మే ఓ వ్యక్తితో పరిచయమై, డెలివరీ బాయ్‌గా మారి ఆ తర్వాత తానే స్వయంగా పోర్టర్ ద్వారా కస్టమర్లకు వేప్స్ అమ్మడం ప్రారంభించాడు. మొదట సికింద్రాబాద్‌లోని ‘అల్ అయాన్ హుక్కా’ యజమాని అబూబకర్ వద్ద వీటిని కొనుగోలు చేసేవాడు. 2024లో ఇతనిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు కావడంతో కొంతకాలం ఈ దందా ఆపేసి బట్టల వ్యాపారం చేశాడు.

ఏడు నెలల క్రితం బట్టల కొనుగోలు కోసం కోల్‌కతా వెళ్లిన రాహిల్ ఖాన్‌కు అక్కడ ‘ఆదిల్ ఎంటర్‌ప్రైజెస్’ అనే దుకాణం కంటపడింది. అక్కడ వేప్ కొనుగోలు చేసిన రాహిల్, దుకాణం యజమాని ఆదిల్‌తో పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి కోల్‌కతాలోని ‘ZS లాజిస్టిక్స్ కొరియర్ సొల్యూషన్స్’ ద్వారా రాహిల్‌కు సరుకు పంపడం ఆదిల్ మొదలుపెట్టాడు. చివరిసారిగా అక్టోబర్ 22, 2026న పార్శిల్ వచ్చింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు రాహిల్ వేర్వేరు పేర్లు, వేర్వేరు మొబైల్ నంబర్లతో 7 సార్లకు పైగా (ప్రతిసారి సుమారు 20 వేప్స్ చొప్పున) ఆర్డర్లు పెట్టాడు. ఆదిల్ పంపే స్కానర్ కోడ్‌లకు తన SBI, HDFC ఖాతాలకు లింక్ అయిన గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించేవాడు.

ఆరు నెలల క్రితం సికింద్రాబాద్‌కు చెందిన అబూబకర్ ద్వారా కరీంనగర్ నిందితుడు మహ్మద్ ఆసిఫ్‌కు రాహిల్ ఖాన్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి హైదరాబాద్ ఫీల్‌ఖానాలోని ‘శ్రీరామ ట్రాన్స్‌పోర్ట్’ ద్వారా 20 సార్లకు పైగా ఆసిఫ్‌కు రాహిల్ ఈ-సిగరెట్లు పంపాడు. ఆసిఫ్ కూడా గూగుల్ పే స్కానర్ల ద్వారానే రాహిల్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేవాడు. ​స్వాధీనం చేసుకున్న ఫోన్, బ్యాంక్ లావాదేవీలు, కొరియర్ వివరాల ఆధారంగా ఈ నెట్‌వర్క్‌లోని మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ‘ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్, 2019’ ప్రకారం దేశంలో ఈ-సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, అమ్మకం, నిల్వ, ప్రచారం పూర్తిగా నిషేధమని ఈగల్ ఫోర్స్ స్పష్టం చేసింది. యువత, విద్యార్థులు వీటి బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిల్లల ప్రవర్తన, వారి ఖర్చులపై నిఘా ఉంచాలని, ఎక్కడైనా అక్రమంగా వేప్స్ విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరింది.