Hyderabad: దసరా పండగకు పల్లె బాట బట్టిన ప్రజలు ఇప్పుడు తిరుగు ప్రయాణం అవుతున్నారు. పండగ సెలవులు ముగించుకుని నగరానికి తిరిగి వస్తున్న ప్రజలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. నగరానికి చేరుకుంటున్న ప్రజలు, ఉద్యోగాలకు వెళ్లడం కోసం తమ తమ ఇళ్లకు త్వరగా చేరుకోవడం కోసం తహతహలాడుతున్నారు. ఇక, ఇదే అదునుగా తీసుకున్న ఆటో, క్యాబ్ వాలాలు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే, సమయానికి విధులకు హాజరు కావాలని అడిగిన కాడికి సమర్పించుకుని తమ ఇళ్లకు ప్రయాణికులు చేరుకుంటున్నారు. అలాగే, పాఠశాలలు సైతం నేటి నుంచి తిరిగి ప్రారంభం అవుతుండటంతో పిల్లలు సైతం త్వరగా ఇళ్లకు చేరుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉదయం 6 గంటల నుంచి కిక్కిరిసి పోయింది. మచిలీపట్నం, నర్సాపూర్, గౌతమి, గోదావరి, చార్మినార్, చెన్నై రైళ్ల ద్వారా విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అయ్యారు.
మరోవైపు, దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు సెలవులు ముగియడంతో హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతున్నారు. దీంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
