Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్ధి ఎవరనేది త్వరలోనే తేలనుంది. ఈ ఎన్నికకు సంబంధించి అభ్యర్ధి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది పార్టీ. సీఎం రేవంత్ నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు… మార్చి 8 న కోర్టు ఎపిసోడ్ పై చర్చించారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై చర్చ జరిగింది. ఈ నెల 6 న ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించిన కమిటీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపికపై పార్టీ చర్చించింది. అభ్యర్ధి ఎంపికపై ఇంచార్జి మంత్రులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం. జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇంచార్జ్ వివేక్.. తుమ్మల నాగేశ్వరరావు లకు రెండు మూడు రోజుల్లో రేసులో ఉన్న అభ్యర్ధులు… గ్రౌండ్ లో బలం ఉన్న అభ్యర్ధుల జాబితా ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్.
Read Also: Falcon Case : ఫాల్కన్ కేసులో ED చార్జ్ షీట్ దాఖలు.. 791 కోట్లు మోసం చేసినట్లు నిర్ధారణ
ఇంఛార్జ్ మంత్రులకు మూడు రోజుల గడువు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ముగ్గురు పేర్లు ప్రతిపాదించాలని సూచించారు. ఐతే.. ప్రస్తుతానికి బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్.. నవీన్ యాదవ్.. బొంతు రామ్మోహన్ పేర్లు పరిశీలిస్తున్నారు. ఇక రెడ్డి కోటాలో… సీఎన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా చర్చలో ఉన్నట్టు సమాచారం. ఐతే జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిచి తీరాల్సిన ఎన్నిక. దీంతో బలమైన అభ్యర్ధిని బరిలో దించాలన్న టార్గెట్ తోనే పార్టీ ఉంది. అంజన్ కుమార్ యాదవ్ .. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకు ఇవ్వాలని కోరారు. మరోవైపు, బలమైన అభ్యర్ధిని బరిలో దించాలన్న లక్ష్యంతో ఏఐసీసీ కూడా అభ్యర్ధి ఎంపికపై సర్వే చేస్తోంది. రాష్ట్ర నాయకత్వం చేసే సిఫార్సు.. ఏఐసీసీ చేస్తున్న సర్వే పరిశీలించిన తర్వాత ఎన్నికల్లో నిలిచే అభ్యర్ధి ఎవరన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని పార్టీ చూస్తుంది. అయితే, ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సతీమణి సునీతకు అవకాశం ఇచ్చారు.. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే..
