Bandi Sanjay: భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ వేడుకలు భక్తి పారవశ్యాన్ని నింపుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోటి దీపోత్సవంపై ప్రశంసలు కురిపించారు. మహదేవుడు కొలువుదీరిన పవిత్రమైన నేల తెలంగాణ అని, త్రిలింగ దేశం అనే పదం నుంచే తెలంగాణ పేరు వచ్చిందని పేర్కొన్నారు. శివయ్యకు అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక జాతరగా అవతరించిందని కొనియాడారు.
కార్తీక మాసం అంటేనే కోటి దీపోత్సవం గుర్తుకొస్తుంది
తెలంగాణలో కార్తీక మాసం అనగానే వెంటనే గుర్తుకొచ్చేది కోటి దీపోత్సవమేనని బండి సంజయ్ అన్నారు. ఈ వేడుకకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు, స్వామీజీలు హాజరవుతున్నారని తెలిపారు. తనకు తెలిసి కోటి దీపోత్సవానికి రాని ప్రవచనకర్త లేరని, భక్తులకు దీవెనలు అందించని పీఠాధిపతి లేరని వ్యాఖ్యానించారు. ఈ స్థాయిలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భక్తి టీవీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
200కు పైగా కల్యాణాలు నిర్వహించడం విశేషం
కోటి దీపోత్సవ వేదికపై ఇప్పటివరకు దాదాపు 200కు పైగా కల్యాణాలు నిర్వహించినట్లు తనకు అనిపిస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. వివిధ దేవాలయాలకు చెందిన కల్యాణమూర్తులు ఈ వేదికపై కొలువుదీరడం విశేషమన్నారు. లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొని దీపాలు వెలిగించడం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోందని చెప్పారు. కోట్లాది మంది భక్తులు తమ ఇళ్లలో టీవీల ముందు కూర్చొని భక్తి టీవీ ద్వారా ఈ వేడుకలను వీక్షిస్తున్నారని తెలిపారు.
కోటి దీపోత్సవం చూస్తుంటే వారణాసిలో ఉన్నట్లుంది
వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ కళా ప్రదర్శనలతో ఈ వేడుకలకు మరింత శోభను తీసుకొస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని చూస్తుంటే వారణాసిలో ఉన్న అనుభూతి కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వేడుకలు కేవలం నేత్రానందాన్ని కలిగించడమే కాకుండా భక్తి భావాన్ని పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజలను ధర్మం వైపు నడిపిస్తున్న గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమమని కొనియాడారు. ఇక, కోటి దీపోత్సవాన్ని ఇంతటి వైభవంగా నిర్వహిస్తున్న భక్తి టీవీకి, సంస్థ ప్రతినిధులు నరేంద్ర చౌదరి, రమా గారికి, టీవీ సిబ్బందికి బండి సంజయ్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించడం అభినందనీయమన్నారు. మరోవైపు.. కోటి దీపోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించే శక్తిని, సంకల్పాన్ని నిర్వాహకుడు నరేంద్ర చౌదరికి మహదేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెబుతున్న ఈ వేడుకలు మరింత గొప్పగా కొనసాగాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్..

