TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్

  • కొయ్యలగూడెం నుంచి కోదాడ వరకు ఫుడ్ సేఫ్టీ తనిఖీలు
  • ఎలుకలు, బొద్దింకల మధ్య ఆహార పదార్థాల తయారీ
  • గడువు ముగిసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులతో వ్యాపారం
  • నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై అధికారుల చర్యలు
Tgsafe

Tgsafe

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పలు ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. టీజీ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆధ్వర్యంలో కొయ్యలగూడెం నుంచి కోదాడ మధ్య ఉన్న హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్ల నిర్వాహకులు పాటిస్తున్న అపరిశుభ్ర వాతావరణం, నాణ్యతా లోపాలు చూసి అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అపరిశుభ్ర వాతావరణం.. పురుగులు పట్టిన ఆహార పదార్థాలు

హోటళ్ల స్టోర్ రూమ్‌లలో ఎలుకలు, బొద్దింకలు స్వేచ్ఛగా సంచరిస్తుండటం అధికారుల కంటపడింది. ఈగలు, దోమల మధ్య అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో వంటకాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేసి, పురుగులు పట్టిన నాసిరకం పప్పు ధాన్యాలతో ఆహారాన్ని తయారు చేస్తుండటం పట్ల అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మాంసాహారం, డెయిరీ ఉత్పత్తులను నిల్వ ఉంచడమే కాకుండా, క్రితం రోజు వండిన నిల్వ ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్న దారుణ వైనం ఈ సోదాల్లో బట్టబయలైంది.

గడువు ముగిసిన లైసెన్సులు.. నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు సీజ్

పలు హోటళ్లు గడువు ముగిసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్సులతోనే దర్జాగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన పలు హోటళ్లను అధికారులు తక్షణమే సీజ్ చేశారు. మరికొన్ని హోటళ్లకు షోకాజ్ నోటీసులతో పాటు వంటగదుల స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. తనిఖీలు పూర్తిగా ముగిసిన అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్ల పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు.