TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!

  • 11 ప్రముఖ హోటళ్ల ఫుడ్ లైసెన్సులు సస్పెండ్
  • కిచెన్లలో ఎలుకలు, బొద్దింకలు.. పాడైన ఆహారం
  • ఆదేశాలు బేఖాతర్.. కొనసాగుతున్న రెస్టారెంట్ నిర్వహణ
  • ఆరు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్.. మూడింటికి షోకాజ్ నోటీసులు
Food

Food

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు తీవ్రస్థాయిలో కొరడా ఝుళిపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు , పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు గచ్చిబౌలి, మాధాపూర్, హైటెక్ సిటీ తదితర కోర్ అర్బన్ రీజియన్‌లోని 20 ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి రాగా, తీవ్రమైన లోపాలు ఉన్నట్లు గుర్తించిన 11 ప్రముఖ సంస్థల ఫుడ్ లైసెన్సులను అధికారులు తక్షణమే సస్పెండ్ చేస్తూ, వాటి కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. వీటితో పాటు మరో ఆరు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, మూడింటికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

నోటీసులను బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా హోటళ్ల నిర్వహణ

అధికారులు ఒకవైపు తీవ్రమైన అపరిశుభ్రత, కలుషిత ఆహారాన్ని గుర్తించి ఫుడ్ లైసెన్సులు రద్దు చేయడం, కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించడం , షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. కొందరు రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం ఆ ఆదేశాలను ఏమాత్రం బేఖాతర్ చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ప్రముఖ అంతెరా (Antera Bar and Restaurant) కిచెన్ అండ్ బార్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ, అధికారులు ఆదేశించిన నిబంధనలను తుంగలో తొక్కి తెల్లారేసరికి యథేచ్ఛగా రెస్టారెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

అపరిశుభ్రత, ఎలుకల సంచారం.. తనిఖీల్లో దిగ్భ్రాంతికర నిజాలు

అధికారులు జరిపిన తనిఖీల్లో ప్రముఖ రెస్టారెంట్ల వంటశాలల్లో బొద్దింకలు, ఎలుకల ఉనికితో పాటు పాడైపోయిన, గడువు ముగిసిన ఆహార పదార్థాలు దర్శనమిచ్చాయి. హైటెక్ సిటీలోని ‘మొనాస్టరీ’లో ఫంగస్ పట్టిన కూరగాయలు, కుళ్ళిన గుడ్లు, లేబుల్స్ లేని ఉత్పత్తులను గుర్తించారు. గచ్చిబౌలిలోని ‘శివాని ది రెస్టారెంట్ అండ్ బార్’లో మురికిగా ఉన్న కిచెన్ ఫ్లోర్, పురుగులు సోకిన ఆహార ధాన్యాలు ఉన్నట్లు తేలింది. అదే ప్రాంతంలోని ‘అల్ సబా’ రెస్టారెంట్‌లో వంటగది చిమ్నీలు జిడ్డుగా మారడమే కాకుండా, సిబ్బంది గుట్కా నములుతూ విధులు నిర్వహించడం, సిగరెట్ బడ్స్ కనిపించడం , ఫ్రిజ్‌లలో ఉడికించిన ఆహారాన్ని, పచ్చి మాంసాన్ని కలిపి ఉంచినట్లు అధికారులు కనుగొన్నారు. మాధాపూర్ ‘లక్కీ మల్టీకుసిన్’, ‘సాయి రామ్ మెస్’లలో అపరిశుభ్రమైన ఫ్రిజ్‌లు, పురుగులు పట్టిన మైదా, మినప్పప్పులను గుర్తించి అధికారులు అక్కడికక్కడే తొలగించారు.

గచ్చిబౌలిలోని ‘ఉడుపీస్ ఉపహార్’లో మురుగునీటి డ్రెయిన్లు బ్లాక్ అయి దుర్వాసన వస్తుండగా, ఎలుకల సంచారాన్ని అధికారులు గమనించారు. హైటెక్ సిటీ ‘కోల్ స్పార్క్’ రెస్టారెంట్‌లో ఫంగస్ పట్టిన 22 కిలోల వేరుశెనగలు, 25 కిలోల మిరియాలు, 8.9 కిలోల జీడిపప్పును స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ‘కాంచీ కేఫ్’లో సాలెగూళ్లతో కూడిన సీలింగ్, పాడైన ముడిసరుకులు లభ్యమయ్యాయి. అంతేకాకుండా ఇన్ఆర్బిట్ మాల్‌లోని ‘అమ్ ఆహా తెలుగు కిచెన్’లో ఎలుకలు కొరికిన మయోనైజ్ ప్యాకెట్లు, ఆహారంలో బొద్దింకలు పడటం కనిపించింది. అదే మాల్‌లోని ‘ఫ్యూజన్ 9 / ఆమ్నీషియా స్కై బార్’లో ఎలుకల మల విసర్జన ఆనవాళ్లు, ఫంగస్ పట్టిన క్యారెట్లను సేకరించి ఫుడ్ సేఫ్టీ టీమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రముఖ హోటళ్లకు ఇంప్రూవ్‌మెంట్ , షోకాజ్ నోటీసులు

ఈ తనిఖీల క్రమంలో నిబంధనల అమలులో కొన్ని లోపాలు గుర్తించిన ఆరు ప్రముఖ సంస్థలకు టీజీ సేఫ్ అధికారులు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. ఇందులో మాధాపూర్‌లోని రమేశ్వరం కేఫ్, గచ్చిబౌలిలోని ఇష్టా (M/s Viruntha Foods), సాహిబ్స్ బార్బెక్యూ, పక్కా లోకల్, గచ్చిబౌలి హోటల్ షాదాబ్ , షా ఘౌస్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ సంస్థల్లో త్వరలోనే రీ-ఇన్స్పెక్షన్ నిర్వహించి, వారు తీసుకున్న పారిశుధ్య చర్యల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. మొత్తం 20 ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లలో జరిపిన ఈ మెరుపు దాడుల్లో హోటల్ అవసా, మినర్వా గ్రాండ్, 63 డిగ్రీస్ మోడర్న్ రీజినల్ బఫే తదితర ప్రతిష్టాత్మక సంస్థల వంటశాలలను సైతం క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.