హైదరాబాద్ నగరంలో బెదిరింపు ఈ-మెయిల్ కలకలం రేపింది. నగరంలో 26/11 తరహా ఉగ్రదాడులను మళ్లీ చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ పంపారు. అయితే.. బెదిరింపు ఈ-మెయిల్ ఫేక్ అని పోలీసులు నిర్ధారించారు. కాచిగూడ టూరిస్ట్ ప్లాజా, రైల్వే స్టేషన్‌ను పేల్చేస్తామని, కనీసం 300 మందిని చంపడమే లక్ష్యమని అందులో బెదిరించారు. లతీఫ్ భట్, ఇతర సహచరులను హతమార్చినందుకు ప్రతీకారంగా దాడులు చేస్తామంటూ హెచ్చరించడంతో స్పెషల్ బ్రాంచ్ నుంచి నగర పోలీసులకు ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్లింది.
భద్రతా చర్యలు.. తనిఖీలు ముమ్మరం
బెదిరింపు మెయిల్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమై తనిఖీలు, గస్తీ పెంచారు. అనుమానిత ప్రాంతాల్లో యాంటీ-సబోటేజ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించగా, నగరవ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేశారు. మరోవైపు ఈ నకిలీ బెదిరింపు మెయిల్ పంపిన ఆగంతకుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వదంతులు నమ్మొద్దు.. డయల్ 112కు సమాచారం ఇవ్వండి
మెయిల్ ఫేక్ అని తేలిన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని పోలీసులు కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు 24 గంటలూ అందుబాటులో ఉన్నారని భరోసా కల్పించారు.

